CM Chandrababu: మహిళల సహకారంతో స్త్రీశక్తి గ్రాండ్ సక్సెస్
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:35 AM
మహిళల సహకారంతో స్త్రీశక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పథకం అమలుపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో...
విద్యార్థినులకు బస్‌పాసుల శ్రమ తప్పించాం
మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం తీసుకొచ్చాం
ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్
ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మహిళల సహకారంతో స్త్రీశక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పథకం అమలుపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్షించారు. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్), బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా వంటి అంశాలపై ఆరా తీశారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు బదులిచ్చారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఉచిత బస్సులను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని, అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు. సీఎం మాట్లాడుతూ.. ‘ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువ. ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతారు. అందుకే ఉమ్మడి రాష్ర్టానికి సీఎంగా ఉన్నప్పటి నుంచీ మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించాను. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే.. ఇప్పుడు స్ర్తీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం. ఒకప్పుడు బాలికా విద్యను ప్రొత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం. ఇప్పుడు విద్యార్థినులు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం. దీని వల్ల బస్ పాసుల కోసం క్యూ లైన్లల్లో నిల్చొనే శ్రమ తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుంది’ అని అన్నారు.
సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు
‘ స్త్రీశక్తి శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని, అందుకనుగుణంగా సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు. ఆర్టీసీ సిబ్బందికీ ప్రయాణికులు సహకరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు.. అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తాం. ప్రజలకు, మహిళలకు మరింత మేలు చేకూర్చగలం’ అని సీఎం అన్నారు.
బోర్డులు... లైవ్ ట్రాకింగ్ పెట్టండి
స్త్రీశక్తి శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుక, ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8,458 స్ర్తీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్లకోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు ప్రయాణిస్తే, 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారని.. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. రెండు, మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్ర్తీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడతామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల వేళలు తెలుసుకుని, ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఫిక్స్ చేసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్ష సందర్భంగా ఆర్టిక్యులేటెడ్ ఈ - బస్సులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ తరహా బస్సులు ప్రస్తుతమున్న సాధారణ బస్సులకు, మెట్రో రైలుకు మధ్య మిడిల్ లెవెల్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు.