Share News

APSRTC: ఎక్కడి నుంచి ఎక్కడికైనా

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:43 AM

సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళలకు వచ్చే శుక్రవారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుకు పచ్చజెండా ఊపింది.

APSRTC: ఎక్కడి నుంచి ఎక్కడికైనా

  • ‘స్త్రీ శక్తి’ శుక్రవారం నుంచే అమలు

  • 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • 8,458 బస్సులు సిద్ధం.. ‘ఆధార్‌’తో టికెట్‌

  • ‘సూపర్‌ సిక్స్‌’లో మరో హామీ అమలుకు రెడీ

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మహిళలకు వచ్చే శుక్రవారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలుకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ నెల 15న ప్రారంభించబోయే స్త్రీ శక్తి పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది. మొత్తం బస్సుల్లో 74శాతమున్న ఐదు రకాల బస్సుల్లో మహిళలు, యువతులు, థర్డ్‌ జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆధార్‌ కార్డు చూపించి కండక్టర్‌ జారీ చేసే జీరో ఫేర్‌ టికెట్‌తో ప్రయాణించవచ్చు. ఆర్టీసీలో మొత్తం 11,449 బస్సులు ఉండగా 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.162కోట్ల చొప్పున ఏడాదికి 1,942కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుందని సోమవారం విడుదల చేసిన జీవోలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు. అయితే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రాష్ట్ర పరిధి దాటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వైపు వెళ్లే వాటిలో సరిహద్దులు దాటాక ఉచిత ప్రయాణం వర్తించదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలు పెట్టి, అవసరం మేరకు భవిష్యత్తులో ఆర్టీసీ కొత్త బస్సులు సమకూర్చనుంది.


డ్రైవర్ల కొరత ఉండటంతో ఆన్‌ కాల్‌ డ్రైవర్లను నియమించుకుని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుపై కసరత్తు చేసి అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమే ‘స్త్రీ శక్తి’ అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆన్‌కాల్‌ డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్‌ డ్యూటీలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది. అధిగమించేందుకు ఆన్‌కాల్‌(తాత్కాలిక) ద్వారా తీసుకోబోతున్నారు. ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అర్హులను పిలుస్తున్నారు. కొన్ని డిపోల పరిధిలో కండక్టర్ల కొరత కూడా ఉండటంతో ఇతర విధులు(ఓడీ) నిర్వహిస్తున్న వారికి రద్దు చేయనున్నారు. కొన్ని బస్టాండ్లలో నాన్‌స్టాప్‌ బస్సులకు టికెట్లు జారీ చేసే గ్రౌండ్‌ బుకింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికీ కండక్టర్‌ డ్యూటీలు వేస్తారు. కొన్ని రోజుల పాటు డబుల్‌ డ్యూటీ చేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లను కోరుతున్నారు.


‘స్త్రీ శక్తి’తో పురుష ప్రయాణికుల తగ్గుదల!

మహిళలకు ఆగస్టు 15నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో పురుష ప్రయాణికులు బస్సుల్లో భారీగా తగ్గవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం వంద మంది ప్రయాణికుల్లో 60మంది పురుషులు, 40మంది మహిళలు ఉండగా.. ‘స్త్రీ శశక్తి’ అమలు తర్వాత మహిళల సంఖ్య అనూహ్యంగా 67శాతానికి పెరుగుతుందని, పురుషులు 33శాతానికి పడిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా 288కోట్ల రూపాయల రాబడి తగ్గుతుందని, అదనంగా నిర్వహణ ఖర్చులు రూ.201కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు.


లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌ కొనాల్సిందే..

ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం లోపల ఉచితంగా ప్రయాణించే అవకాశమున్న మహిళలు.. దూరప్రాంతాలకు వెళ్లే లగ్జరీ, ఏసీ బస్సుల్లో జర్నీ చేయాలంటే టికెట్‌ కొనాల్సిందే. అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ స్లీపర్‌, స్టార్‌ లైనర్‌, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించరు.

Updated Date - Aug 12 , 2025 | 04:44 AM