Share News

స్త్రీ శక్తి పథకం.. రూ.23.69 కోట్లు

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:35 AM

స్ర్తీ శక్తి పథకం ఉమ్మడి కృష్ణా జిల్లాలో సూపర్‌ హిట్‌ అయ్యింది. తొలి నెల రోజుల్లో రికార్డు స్థాయిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. 78,45,962 మంది ప్రయాణికులకు రూ.23.69 కోట్ల రాయితీని ప్రభుత్వం కల్పించింది. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వంగా వారి మన్ననలు పొందుతోంది. అయితే మహిళల సంఖ్య భారీగా పెరగడంతో పురుషులకు కూర్చోవడానికి సీట్లు ఉండటంలేదని, చెరిసగం సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ మగవారి నుంచి సర్వత్రా వ్యక్తమవుతోంది.

 స్త్రీ శక్తి పథకం.. రూ.23.69 కోట్లు

- నెల రోజుల్లో మహిళలకు ప్రభుత్వ రాయితీ

- ఉమ్మడి కృష్ణాజిల్లాలో 78,45,962 మంది ప్రయాణాలు

- ఎన్టీఆర్‌ జిల్లాలో 51,57,863 మంది ప్రయాణికులకు రూ.14.37 కోట్ల సబ్సిడీ

- కృష్ణాజిల్లాలో 26,88,099 మందికి రూ.9.31 కోట్ల రాయితీ

- స్ర్తీ శక్తి పథకం అమలులో అనేక మైలురాళ్లు

- తెరపైకి సీట్లలో పురుషులకు రిజర్వేషన్‌ కల్పించాలన్న డిమాండ్‌

స్ర్తీ శక్తి పథకం ఉమ్మడి కృష్ణా జిల్లాలో సూపర్‌ హిట్‌ అయ్యింది. తొలి నెల రోజుల్లో రికార్డు స్థాయిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. 78,45,962 మంది ప్రయాణికులకు రూ.23.69 కోట్ల రాయితీని ప్రభుత్వం కల్పించింది. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వంగా వారి మన్ననలు పొందుతోంది. అయితే మహిళల సంఖ్య భారీగా పెరగడంతో పురుషులకు కూర్చోవడానికి సీట్లు ఉండటంలేదని, చెరిసగం సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ మగవారి నుంచి సర్వత్రా వ్యక్తమవుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

స్ర్తీ శక్తి పథకం ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లాలో తొలి నెల రోజుల్లో 78,45,962 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. మహిళలకు ప్రభుత్వం తరఫున అందించిన టికెట్ల రాయితీ విలువ రూ.23,69,32,651గా ఉంది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు గణాంకాలను విడుదల చేశారు. గత ఆగస్టు 15వ తేదీన స్ర్తీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సెప్టెంబరు 15వ తేదీతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లాలో 51,57,863 మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆటోనగర్‌, గవర్నర్‌పేట-1, గవర్నర్‌పేట-2, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు, విద్యాధరపురం, విజయవాడ బస్‌ డిపోల పరిధిలో విజయవాడ సబర్బన్‌, రూరల్‌ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించారు. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోని మహిళలకు రూ.14.37 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం కల్పించింది. కృష్ణాజిల్లాలో 26,88,099 మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు బస్‌డిపోల పరిధిలో మొత్తం 288 షెడ్యూల్స్‌లో మహిళలు రాకపోకలు సాగించారు. విజయవాడకు ఎక్కువ సంఖ్యలో వెళ్లి వచ్చారు. జిల్లాలో మహిళలకు ప్రభుత్వం తరఫున జీరో ఫేర్‌ టికెట్ల ప్రాతిపదికన రూ.9.31 కోట్ల సబ్సిడీని భరించటం జరిగింది.

ఆర్టీసీ స్థూల ఆదాయంలో ఒక వంతు రాయితీ

ఆర్టీసీ బస్సుల్లో ప్రధానంగా మహిళలకు సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌.. ఈ ఐదు బస్సులలో జీరో ఫేర్‌ టికెట్‌ రాయితీ కల్పిస్తున్నారు. ఈ బస్సులలో 60 శాతం అంతకు మించి మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉంది. మిగిలిన డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, నైట్‌రైడర్‌, గరుడ, అమరావతి. డాల్ఫిన్‌ బస్సులలో రాయితీ లేదు. స్థూలంగా అన్ని బస్సుల విషయానికి వస్తే ఒక వంతు మహిళా ప్రయాణికుల శాతం ఉంటోంది. హై ఎండ్‌ బస్సులలో పురుషుల ప్రయాణాల శాతం ఎక్కువుగా ఉండటం వల్ల ఓవరాల్‌గా చూస్తే మహిళలకు ఒక వంతు రాయితీ పోగా.. సగ భాగం డైరెక్టుగా ఆదాయం వస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఆర్టీసీకి రూ.38.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయంలో ఇప్పటి వరకు చూస్తే రూ.14.37 కోట్ల మేర మహిళలకు రాయితీగా ప్రభుత్వం ఇచ్చింది. స్థూలంగా చూస్తే.. రూ. 24.81 కోట్ల ఆదాయం ఆర్టీసీ అందిపుచ్చుకుంది. కృష్ణాజిల్లాలో మొత్తంగా రూ.15.03 కోట్ల మేర స్థూల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.9.31 కోట్ల మేర మహిళలకు సబ్సిడీ కింద పోతే రూ. 6.72 కోట్ల మేర ఆర్టీసీకి మహిళాయేతర ప్రయాణికుల ఆదాయం వచ్చింది.

నెల రోజుల్లో పెనుమార్పులు

ఆర్టీసీలో స్ర్తీశక్తి పథకాన్ని ప్రారంభించిన నెల రోజుల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కంకిపాడు, గన్నవరం, కొండపల్లి వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకోవటానికి రాకపోకలు సాగించే మహిళలంతా కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలో చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, షాపింగ్‌ వంటివాటికి వచ్చే మహిళలంతా ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో సబర్బన్‌ పరిధిలో రూరల్‌ ప్రాంతాల నుంచి పైన చెప్పుకున్న నగర, పట్టణ ప్రాంతాలకు వచ్చే బస్సులలో నూటికి 80 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రభంజనంతో పురుషులు పాసులు రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ రవాణా చూసుకుంటున్నారు.

పురుషులకు సీట్ల రిజర్వేషన్‌పై చర్చ!

మహిళలకు రాయితీ ఇస్తున్న బస్సుల్లో వారి సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో పురుషులు బస్సుల్లో ఎక్కి ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడుతోంది. భారత హేతువాద సంఘం దీనిని విస్తృతంగా చర్చనీయాంశం చేస్తోంది. ఆ సంస్థ అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య మహిళలకు, పురుషులకు ఆర్టీసీ బస్సుల్లో చెరి సగం సీట్ల రిజర్వేషన్‌ ఉండాలన్న వాదన తెరపైకి తెచ్చారు. చాలా మంది పురుషులు కూర్చోవటానికి సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ అధికంగా ఉన్నారని చెబుతున్నారు. పురుషులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:35 AM