Worker Exploitation: స్వదేశానికి రప్పించండి
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:21 AM
ఉపాధి కోసం ఆఫ్రికాకు వెళ్లిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చంద్రకుమార్ రెడ్డి అనే యువకుడు చిక్కుల్లో పడ్డాడు.
ఆరోగ్యం క్షీణించింది.. ఆత్మహత్య ఆలోచన వస్తోంది
కంపెనీ యాజమాన్యం కనికరించడం లేదు
ఆఫ్రికాలో ఇరుక్కుపోయిన శ్రీసత్యసాయి జిల్లావాసి విజ్ఞప్తి
ఓబుళదేవరచెరువు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం ఆఫ్రికాకు వెళ్లిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చంద్రకుమార్ రెడ్డి అనే యువకుడు చిక్కుల్లో పడ్డాడు. జీఎంఆర్ ఇండస్ట్రీ కంపెనీలో ఉద్యోగం లభించడంతో ఆఫ్రికాలోని ఘనా దేశానికి ఏడాది క్రితం వచ్చానని, కంపెనీ యాజమాన్యం తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఓబుళదేవరచెరువు మండలం వనుకువారిపల్లి చంద్రకుమార్ రెడ్డి స్వగ్రామం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బతుకుతెరువు కోసం ఆఫ్రికాకు వెళ్లాడు. తాను పనిచేసే కంపెనీకి గణేష్ ముత్యాలరెడ్డి, కౌశిక్ రెడ్డి యజమానులు అని, తనను కాపాడి స్వదేశానికి తీసుకువెళ్లాలని చంద్రకుమార్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. ‘మార్కెట్‌లో వస్తుండగా దొంగలు దాడి చేశారు. కంపెనీ డబ్బును దోచుకున్నారు. దీనికి కంపెనీ యాజమాన్యం నన్నే బాధ్యుణ్ని చేసింది. రూ.5 లక్షలు నా నుంచి రికవరీ చేసింది. నా ఆరోగ్యం క్షీణించింది. స్వదేశానికి పంపమని వేడుకుంటున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నా పరిస్థితి బాగలేదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తోంది. నా ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఇప్పటికే 15 కిలోల వరకు బరువు తగ్గాను. కాళ్లావేళ్లా పడినా కంపెనీ వారు కనికరం చూపడంలేదు. స్వదేశానికి పంపకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం. నేను ఆత్మహత్య చేసుకుంటే కంపెనీవారే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని బాధితుడు వీడియోలో పేర్కొన్నాడు.