Deputy CM Pawan: బెదిరింపులు మానండి
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:39 AM
‘ఒక మాజీ సీఎం వచ్చి.. మిమ్మల్ని చంపేస్తాం.. మేమంటే ఏమిటో చూపిస్తామని అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నామని అర్థం.
లేదంటే ఏం చేయాలో తెలుసు
వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక
రౌడీలకు సపోర్టు చేసేది పార్టీయే కాదు
చంపేస్తాం.. మేమేంటో చూపిస్తామని ఒక మాజీ సీఎం బెదిరిస్తున్నారు
ఇది తప్పుడు సంకేతాలు ఇవ్వడమే
క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరు
జనసేన నేతలు ప్రైవేటు సెటిల్‌మెంట్స్ చేయొద్దు
మన కోసం చొక్కాలు చించుకున్నారు
ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకు వచ్చి ఓట్లేశారు
అందుకు కృతజ్ఞతగా మనం ప్రజల వైపు నిలబడాలి
లేదంటే అందరం తలదించుకోవలసి వస్తుంది
పార్టీ, పదవుల కంటే జనమే నాకు ముఖ్యం
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు
అధికారులు గమనించాలి: డిప్యూటీ సీఎం
పదవులు పొందిన జనసేన నేతలతో ‘పదవి-బాధ్యత’ పేరిట సమావేశం
తప్పు చేసినవాడిని దెబ్బ కూడా కొట్టకూడదంటే క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది.. నేరాలు ఎక్కడ ఆగుతాయి..? జనసేన నాయకులు పదవీ బాధ్యతలో భాగంగా.. పనిచేసే పోలీసులకు మద్దతుగా నిలబడాల్సిందే.
- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ఒక మాజీ సీఎం వచ్చి.. మిమ్మల్ని చంపేస్తాం.. మేమంటే ఏమిటో చూపిస్తామని అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నామని అర్థం. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వైసీపీ నాయకులు బెదిరించడం మానాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో సోమవారం మంగళగిరిలో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమంలో ఆయన వారితో ప్రమాణం చేయించారు. సుదీర్ఘంగా ప్రసంగించారు. వైసీపీ తీరు, ఆ పార్టీ నాయకులు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్య విధంగా మాట్లాడండి.
ఇలాంటి బెదిరింపులు మాత్రం ఆపాల్సిందేనని స్పష్టంచేశారు. ఆకు రౌడీలకు అండగా ఉంటామని.. రౌడీలకు సపోర్టు చేస్తామన్న పార్టీని తాను పార్టీగానే గుర్తించనన్నారు. ‘అదో రౌడీల సమూహంగా ఒక్కోసారి అనిపిస్తుంది. వారిది రాజకీయ పార్టీ అయితే పాలసీపై మాట్లాడాలి. దానిపై చర్చించాలి’ అని సూచించారు. జగన్‌కు ఆదివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశానని గుర్తుచేశారు. తనకు ఎవరూ శత్రువు కాదని, వారి విధివిధానాలనే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. ‘లోపల ఎలాంటి శత్రుత్వం ఉండదు. మీ తీరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే గొడవ పెట్టుకోవడానికి నా జీవిత కాలం సంసిద్ధంగా ఉంటాను. బహుశా ఇలా జరిగితే అన్న భయం కూడా లేదు. అలాంటి భయం ఉంటే ఇక్కడి వరకూ ఎందుకొస్తాం..? అవసరం అనుకుంటేనే చివరి దశలో రోడ్లపైకి వచ్చి, గొడవలు పెట్టుకుంటాం. అది కూడా తప్పదనుకుంటేనే చేస్తాం. జనసేన నాయకులకు నేను చెప్పేది ఇదే. మీరు రోడ్ల మీద గొడవ పెట్టుకోవాలని చెప్పడం లేదు.. బలమైన వాదన వినిపించాలని చెబుతున్నాను. అందరికీ ఆమోదయోగ్యమైన భాషలో గట్టిగా చర్చించండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ ఆంధ్రప్రదేశ్‌కు.. తద్వారా భారతదేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాను. వైసీపీ నేతలూ.. మీరు ఆ భాషను వదిలేయండి. రౌడీలను వెనకేసుకొస్తాం.. గంజాయి బ్యాచ్‌లను వెనుకేసుకొస్తామంటే కుదరదు. తెనాలిలో గంజాయి రౌడీలకు వ్యతిరేకంగా పోలీసులు పని చేస్తుంటే.. వీళ్లు గంజాయి బ్యాచ్‌కు అండగా కోర్టుకు వెళ్లారు. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరు. రాజకీయ నాయకత్వం అనుకుంటే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది’ అని చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని.. అధికారులు గమనించాలని స్పష్టంచేశారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రైవేటు సెటిల్‌మెంట్స్ చేయొద్దు..
జనసేన నాయకులు ప్రైవేటు సెటిల్‌మెంట్స్ చేయవద్దు. చేస్తే మనకు, గత ప్రభుత్వానికి తేడా ఏముందో ఆలోచించండి. ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే ఇక కష్టం. నేను ఓడిపోయినా, గెలిచినా ప్రజల కోసమే పని చేశాను.. చేస్తాను. అందుకనే మీకు రెండు చేతులూ జోడించి చెబుతున్నాను. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా మీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. అంబానీ దగ్గర నుంచి అందరూ తిరుమల హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులను ఏం చేయాలి.. ఎవరి ద్వారా చేయించాలన్నది స్వామి ఇష్టం. మనకు సంబంధం లేదు. ఈ మధ్య కులాల సమస్యలు ఎక్కువయ్యాయి. పిఠాపురంలో చిన్న పిల్లలతో కులాల గురించి మాట్లాడించారంటే మనుషులు ఇంత చండాలమై పోయారేమిటని అనిపించింది.
మూడున్నరేళ్ల సమయం ఉంది..
చాలా మంది జనసేనకు బూత్ కమిటీలు లేవు. నాయకులు లేరని అంటున్నారు. మాదేమీ కాంగ్రెస్, వైసీపీలా మారిపోలేదు. మా పంట మేమే పండించుకోవాలి. వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉండొచ్చు.. బాబాయి మరొకలా ఉండొచ్చు.. ఆ తర్వాత చంపేయొచ్చు.. అది వేరే విషయం. మనకు మిగతా పార్టీల్లాంటి పరిస్థితులు లేవు. అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి సమయం పడుతోంది. ఇంకా మనకు మూడున్నరేళ్లు సమయం ఉంది. పిఠాపురంలో ఓ విధానం ప్రారంభించాం. 53 గ్రామాలకు గాను 51 గ్రామాల్లో అన్ని వార్డు కమిటీలతో పాటు బూత్ కమిటీలను కూడా నియమించాం. నాకు నచ్చిన వారిని, నాయకులకు నచ్చినవారిని పెట్టలేదు. పది మంది జనసైనికులు, వీర మహిళల నుంచి అభిప్రాయాలు తీసుకుని.. మీకు నాయకుడిగా ఎవరు కావాలో ఎన్నుకోండని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతిలో చేశాం. ఇది ప్రతి నియోజకవర్గానికీ మోడల్ అవ్వాలి.
కూటమిలో గొడవలు తప్పవు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల్లో సీట్ల వాటాల్లోనో, మరో దానిలోనో గొడవలు, ఇబ్బందులు తప్పవు. అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. పదవి అనేది అలంకారం కాదు.. బాధ్యత. నేను అంత బాధ్యతగా ఉన్నాను. మూడున్నరేళ్లలో మీరు అద్భుతంగా చేస్తే భవిష్యత్ ఉంటుంది. రాష్ట్రంలోని సమస్యలన్నీ తీసుకొచ్చి నా భుజాల మీద వేస్తే కుంగిపోతాను. కాబట్టి మీరు కూడా కొంత బాధ్యత, బరువు పంచుకోవాలని నా విన్నపం. మా పదవులు తీసుకున్నవారు బాధ్యతా తీసుకోవాలి. ఒక ఊర్లో రోడ్లు లేకపోతే పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లే వచ్చేస్తుందని అన్నారంటే.. దీనిని ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యంగా భావించాలి. ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని.. ఉపముఖ్యమంత్రి వద్దకు వస్తేనే పరిష్కారం అవుతుందంటే మన ప్రజాస్వామ్యం బలహీనపడిందని అర్థం. చూపు సరిగా లేని ఆడపిల్ల వచ్చి మా ఊరికి రోడ్డు వేయాలని నన్ను కాదు అడగాల్సింది.. నిజంగా బాధ్యత గల ప్రభుత్వాలుంటే ఎప్పుడో అయిఉండేది. కానీ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలహీనం చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం, బాధ్యత పెరిగితేనే వారిలో కోపం తగ్గుతుంది.
మాజీ సీఎం భార్యను తిడితే..
మన కళ్ల ముందు ఒకడు కూర్చుని.. ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే ఏమీ చేయలేమన్న స్థితిలో ఉన్నామా అన్న భయం వేసింది. కూటమి పదేళ్ల్లు, 15 ఏళ్లు ఉంటుందని చెబుతున్నానంటే మనం తగ్గాలనో.. మరొకరిని పెంచాలనో కాదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే నా లక్ష్యం. ప్రజాస్వామ్యంలో అందరం కొట్టుకుంటే అరాచకమే రాజ్యమేలుతుంది. సామినేని ఉదయభాను, పెండెం దొరబాబు, కిలారి రోశయ్య, జయమంగళ అందరూ గౌరవప్రదంగా ఉండేవారు. అలాంటి వ్యక్తులే వైసీపీలో ఇమడలేకపోయారు. వాళ్లంతా మన పార్టీలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోండని నేనెప్పుడూ వాళ్లకు చెప్పలేదు. గెలవండి.. మనమేంటో చూపిద్దామన్న పిచ్చిమాటలు నేనెప్పుడూ మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చాం. మన తడాఖా చూపిద్దామని బాధ్యతగల వ్యక్తులు అంటారా..? మనం బ్యాలెన్స్‌గా వెళ్తామనే జనం నమ్మారు.
పోలవరానికి అమరజీవి పేరు పెట్టాలి
త్యాగాలు చేసినవారిని గుర్తించకపోతే మనం చరిత్రకు ఏం గౌరవిమిచ్చినట్లు? దేశంలో తొలిసారి భాషాప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన వారు, తెలుగు వారి ఉనికి, జాతి, ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నామంటే దానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. అలాంటి వ్యక్తుల్ని స్మరించుకోకపోవడం చాలా తప్పు. ఐదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తుల పేర్లు కూడా పెట్టేస్తున్నారు. పొట్టి శ్రీరాములుకు సరైన గుర్తింపు, నివాళి ఇవ్వాలంటే.. పోలవరం ప్రాజెక్టుకు ఆ మహానుభావుడి పేరు పెడితే బాగుంటుందని నా ఆలోచన. అంబేడ్కర్‌ను ఒక కులానికి పరిమితం చేస్తే ఏమీ చేయలేం. ఆయన అందరివాడు.
బైకర్ వ్లాగర్ స్వాతికి అభినందనలు..
దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ జెడ్ వ్లాగర్ స్వాతి రోజాను పవన్ కల్యాణ్ అభినందించారు. సోమవారం మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో ఆమె డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆమె సాహస యాత్ర గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించిన సమయంలో వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఆ విషయం తెలుసుకున్న ఆయన ఆమెకు శ్రీశైలంతో పాటు తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం మంగళగిరి వచ్చిన ఆమె ఆయన చూపిన శ్రద్ధకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఇదే విషయాన్ని పదవి-బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. ఒక ఆడపిల్లకు వసతి కల్పించని పరిస్థితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేనకు 3,459 నామినేటెడ్ పోస్టులు
పోరాటాలు చేసి.. కష్టపడినవారికే పదవులు: పవన్
పార్టీ కోసం మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చామని జనసేనాని స్పష్టంచేశారు. 3 పార్టీల కూటమిలో భాగంగా ఇప్పటి వరకూ జనసేనకు 3,459 నామినేటెడ్ పదవులు లభించాయన్నారు. మరికొన్ని త్వరలోనే భర్తీ అవుతాయని తెలిపారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల్లో కొన్ని కీలకమైన పోస్టులు రానున్నాయని చెప్పారు. ఇందులో డిప్యూటీ సీఎం, రెండు మంత్రి పదవులు, రెండు ఎంపీలు, రెండు ఎమ్మెల్సీలు, 21 ఎమ్మెల్యేలతో పాటు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పోస్టులున్నాయన్నారు. ‘పార్టీ సభ్యత్వం లేకుండా జనసేన పదవి పొందడం చాలా తప్పు. ఎవరైనా అలా పదవి తీసుకుంటే వెంటనే సభ్యత్వ కార్డు తీసుకోండి. కండువా వేసుకుంటే జనసేన మెంబర్ కాదు. క్రియాశీలంగా పని చేయాలి. కొన్ని సంవత్సరాలు పని చేస్తేనే పోటీకి అర్హులన్న నిబంధన పెట్టాం. జనసేన బలం జనసైనికులు, వీరమహిళలే. ఇంత మంది ఆడబిడ్డలు కూర్చొని పోరాటం చేశారంటే.. ఏ పదవి ఉందని బలంగా నిలబడ్డారు? సభ్యత్వ డ్రైవ్ పిఠాపురంలో ప్రారంభిస్తున్నాం. ఫిబ్రవరి నాటికి పూర్తయిపోవాలి. తొలుత మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం వద్దనుకున్నాను. కానీ యువత, ఆడబిడ్డలను ఉద్దేశించే ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. దానికి అందరూ సహాయ సహకారాలు అందించాలి’ అని కోరారు.