మట్టిదందాను అడ్డుకోండి
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:48 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా మట్టిదందా సాగుతోందని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరుతూ మచిలీపట్నం, గూడూరు మండలాలకు చెందిన జనసేన నాయకులతో కలిసి స్థానికులు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న మండల స్థాయి అధికారులకు దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేశామని, వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి, విచారణ చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- కలెక్టర్‌కు గూడూరు, మచిలీపట్నం మండలాల ప్రజల ఫిర్యాదు
- గూడూరులో ఆలయ భూముల నుంచి అక్రమంగా తవ్వకాలు
- మచిలీపట్నం మండలం పెదయాదరలో యథేచ్ఛగా తరలింపు
- పెదపట్నంలో అసైన్డ్ భూముల్లో అక్రమంగా చెరువుల తవ్వకాలు
- ఆ వైౖపునకు వెళ్లవద్దని తాలూకా పోలీసులతో గ్రామస్థులకు బెదిరింపులు!
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా మట్టిదందా సాగుతోందని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరుతూ మచిలీపట్నం, గూడూరు మండలాలకు చెందిన జనసేన నాయకులతో కలిసి స్థానికులు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న మండల స్థాయి అధికారులకు దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేశామని, వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి, విచారణ చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవదాయశాఖ భూములను తవ్వేస్తున్నారు
గూడూరు మండలం గూడూరులోని వెంకన్న పేరంటాలు గుడికి చెందిన 6.51 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా 300 ట్రక్కులకు పైగా మట్టిని తవ్వి వారం రోజులుగా విక్రయించేస్తున్నాడని గూడూరు మండల జన సేన జనరల్ సెక్రటరీ బత్తిన హరిరామ్, జనసేన కార్యకర్తలు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. లీజు గడువు కూడా ముగిసిందని తెలిపారు. ఈ విషయంపై ఆలయ ఈవోకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా కావాలని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజులుగా మట్టిని తవ్వేసి విక్రయిస్తున్న వ్యక్తికే ఆలయ భూములను రూ.1.12లక్షలకు లీజుకు ఇటీవల మళ్లీ ఇచ్చారని జనసేన నాయకులు అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గూడూరు మండలం కంకటావ గ్రామంలో ఉమాహేశ్వర వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూముల్లో మట్టితవ్వేసి విక్రయించారని, ఈ అంశంపైన ఫిర్యాదు చేస్తే, ఆలయ ఈవో పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ మట్టి తవ్వకాల అంశంపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేయించాలని, అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పెదయాదరలో యథేచ్ఛగా మట్టి తరలింపు
మచిలీపట్నం సౌత మండలం పెదయాదర గ్రామపంచాయతీ శివారు చినయాదర గ్రామంలో ఆర్‌ఎస్ నెంబరు 18లో 4.03 ఎకరాల్లో తుమ్మాచెరువు ఉందని, ఈ చెరువులో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, పంచాయతీ తీర్మానం కూడా చేయకుండా గ్రామసర్పంచ్ మట్టిని తవ్వి విక్రయించేస్తున్నారని గ్రామస్తులు అధికారులకు అర్జీ అందజేశారు. ఈ చెరువులో నుంచి ఇప్పటి వరకు జేసీబీలతో 400 ట్రక్కులకుపైగా మట్టిని తవ్వి, ఒక్కో ట్రక్కు మట్టిని రూ.800 చొప్పున బయటి వ్యక్తులకు విక్రయించేశారని ఆరోపించారు. గతంలో ఈ చెరువులో గ్రామానికి చెందిన పేదలు ఉపాధి హామీ పనులు చేసేవారని, ఈ ఏడాది యంత్రాల ద్వారా మట్టిని తవ్వడంతో ఉపాధి పనులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. చెరువులోని మట్టిని తవ్వడంతోపాటు, చెరువుగట్టును కూడా తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు చెరువుగట్టు బలోపేతం పేరుతో పంచాయతీ నిధులను ఖర్చు చేసి బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మట్టి అక్రమంగా తవ్వి విక్రయించడంపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
అసైన్డ్ భూముల్లో చెరువుల తవ్వకం
పెదపట్నం పంచాయతీలో సముద్రం పక్కనే ఉన్న అసైన్డ్‌భూముల్లో గత పది రోజులుగా రొయ్యల చెరువుల తవ్వకాల పనులు చేస్తున్నారు. గతంలో ఈ భూముల పక్కనే పేదలకు ఒక్కొక్కరికి 47 సెంట్ల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఈ భూములకు సంబంధించి పట్టాదారులకు సరిహద్దులు చూపలేదు. ఈ భూముల పక్కనే 20 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలను ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్రకు గ్రామస్థులు ఈ విషయం తెలపగా, ఆయన అసైన్డ్‌భూముల్లో చెరువులు తవ్వవద్దని చెప్పినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే కొందరు పెద్దమనుషులపేరుతో సమావేశం ఏర్పాటు చేసి చెరువులు తవ్వాలని నిర్ణయం తీసుకుని చెరువుల తవ్వకం పనులను ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఆ వైపునకు రాకుండా చర్యలు తీసుకున్నారు. చెరువులు తవ్వేవారు ఓ అడుగు ముందుకేసి గ్రామస్థుల్లో కొందరిని మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పెదపట్నంలో తవ్వుతున్న చెరువుల వద్దకు వెళ్లి అడ్డుకున్నా, ఈ విషయం బయటకు వచ్చేలా వ్యవహరించినా కేసులు పెడతామని ఎస్‌ఐ స్థాయి అధికారితో బెదిరించడంతో గ్రామస్థులు మిన్నకుండిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ఎస్‌ఐ గ్రామస్థులకు వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.