Share News

MP Lavu Srikrishna Devarayalu: ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:30 AM

అశాస్త్రీయ విభజన వల్ల ఏపీ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 92 కేంద్ర పథకాలు అటకెక్కాయని...

MP Lavu Srikrishna Devarayalu: ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

  • పనిదినాల పెంపు హర్షణీయం

  • ఏపీకి అదనపు తోడ్పాటు ఇవ్వండి: లావు

న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అశాస్త్రీయ విభజన వల్ల ఏపీ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 92 కేంద్ర పథకాలు అటకెక్కాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాదిన్నర కాలంలో ఆ పథకాలను మళ్లీ గాడిలో పెట్టామని వివరించారు. బుధవారం లోక్‌సభలో ‘వికసిత్‌ భారత్‌-గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌- గ్రామీణ్‌(వీబీ-జీరామ్‌జీ) బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి సాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వీబీ-జీరామ్‌జీ బిల్లు ప్రకారం రాష్ట్రం భరించాల్సిన 40 శాతం వాటా విషయంలో ఏపీకి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని లేదా అదనపు సాయం అందించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. పని దినాలను 125 రోజులకు పెంచడం సరైన నిర్ణయమని కొనియాడారు. నిధులను వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా గ్రామాల్లో శాశ్వత సామాజిక ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో పేదరికం తగ్గుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని ఉత్పాదకత పెంచేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ పథకంలో జరుగుతున్న అవినీతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో గత పదేళ్లలో రూ.82 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, వాటిలో రూ.48 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని తెలిపారు. నిధుల రికవరీతో మాత్రమే సరిపెట్టకుండా అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టంలో మార్పులు తేవాలని డిమాండ్‌ చేశారు.


పల్నాడులో మిర్చి పరిశోధన కేంద్రం

పల్నాడు జిల్లాలో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి లావు విజ్ఞప్తి చేశారు. పల్నాడు-గుంటూరు ప్రాంతం భారత్‌లో అతిపెద్ద, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిర్చి ఉత్పత్తి కేంద్రమన్నారు. పల్నాడు మిర్చి రైతులకు అధిక దిగుబడినిచ్చే తెగుళ్లను తట్టుకునే రకాలు అందుబాటులో లేవని తెలిపారు. సంప్రదాయ పద్ధతుల్లో పంటను ఆరబెట్ట డం వల్ల నాణ్యత తగ్గి, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో వెనుకంజలో ఉంటున్నారని చెప్పారు.

ఏఐ ల్యాబ్స్‌గా రాష్ట్రంలో 9 ఐటీఐలు

లోక్‌సభలో కేంద్రం వెల్లడి

ఇండియాఏఐ మిషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లోని 9 ప్రభుత్వ ఐటీలను డేటా అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ల్యాబ్స్‌గా మార్చేందుకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాదతెలిపారు. లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, డోన్‌, గాజువాక, కాకినాడ, విజయవాడ, కడప, నెల్లూరు ఐటీఐలను డేటా అండ్‌ ఏఐ ల్యాబ్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

Updated Date - Dec 18 , 2025 | 04:30 AM