Minister Narayana: ఇకనైనా ఏడుపులు ఆపండి
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:44 AM
అమరావతిపై వైసీపీ నేతలు వారి ఏడుపులను ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వారిపై...
లేకుంటే ఈసారి 11 కూడా ఇవ్వరు
నిర్మాణ సమయంలో వర్షానికి గుంతల్లోకి నీళ్లు రావా?
ఆ మాత్రానికే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లా..!: మంత్రి నారాయణ
ఏడీసీ సీఎండీతో కలసి క్షేత్రస్థాయి పర్యటన
తుళ్లూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అమరావతిపై వైసీపీ నేతలు వారి ఏడుపులను ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోన్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కొండవీటి వాగు నీటి ప్రవాహానికి ఆటంకం కలగడంతో వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాలను మంత్రి మంగళవారం పరిశీలించారు. అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఎండీ లక్ష్మీ పార్థసారథితో కలిసి ఆయా ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు. విజయవాడ పశ్చిమ బైపా్‌సపై ఈ-11 రోడ్డు వద్ద కొండవీటి వాగుపై నేషనల్ హైవేస్ అధికారులు ఓ వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో అక్కడ మట్టిని అలాగే వదిలేయడంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో వంతెన దిగువ నుంచి నీరు వెళ్లే మార్గం లేక నీరుకొండ పరిసర ప్రాంతాలలోని పొలాల్లో వరద నీరు నిలిచిపోయిందని మంత్రి వివరించారు. వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి నారాయణ అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
పొక్లెయిన్‌లు ఏర్పాటు చేసి మట్టి తొలగించడంతో పాటు జాతీయ రహదారిపై కూడా స్వల్పంగా గండి కొట్టి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఆ తర్వాత మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ, వైసీపీ నేతలు అమరావతిపై ఏడుపు ఆపలేదంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ప్రజలు మీకివ్వరు. ఎక్కడైనా నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా...? గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా? అమరావతిపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు సహించరు. ఎవరెన్ని అనుకున్నా అమరావతి పనులు జరిగిపోతూనే ఉంటాయి. వచ్చే మార్చి నాటికి అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు కూడా సిద్ధం చేస్తున్నాం. రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న వారు అమరావతికి వచ్చి పరిస్థితి చూడాలి’ అని మంత్రి సూచించారు.