Visakhapatnam: ట్రేడింగ్‌లో నష్టపోయి సొంతింటికే కన్నం
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:13 AM
పంతొమ్మిదేళ్ల కుర్రాడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని, అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేయడానికి స్నేహితులతో కలసి ప్లాన్ వేశాడు.
స్నేహితుల సాయంతో దొంగతనం
12 తులాల బంగారం, నగదు చోరీ..
చివరికి బెడిసి కొట్టిన ప్లాన్
పోలీసుల విచారణలో గుట్టు రట్టు
విశాఖలో నలుగురి అరెస్టు
విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పంతొమ్మిదేళ్ల కుర్రాడు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని, అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేయడానికి స్నేహితులతో కలసి ప్లాన్ వేశాడు. దొంగతనం విజయవంతంగా పూర్తయ్యాక ఏమీ తెలియనట్లు, గుర్తు తెలియని వ్యక్తులు నానమ్మను, తనను కొట్టి రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారం అపహరించినట్లు అందర్నీ నమ్మించబోయాడు. కానీ పోలీసుల విచారణలో గుట్టు బయటపడింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఆ వివరాలను శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ శంఖబ్రతబాగ్చి వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నంలోని రెడ్డికంచరపాలెం ఇందిరానగర్-5లో జీవీఎంసీ కాంట్రాక్టర్ ధర్మాల ఆనందకుమార్‌రెడ్డి తన తల్లి యల్లయ్యమ్మ, భార్య కోమలి, కుమారుడు కృష్ణకాంత్‌రెడ్డి, కుమార్తెతో కలిసి రెండంతస్థుల భవనంలో నివసిస్తున్నారు. ఓ కార్పొరేట్ కాలేజీలో బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణకాంత్‌రెడ్డి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక తమ ఇంట్లో దోపిడీకి స్నేహితులతో కలసి ప్రణాళిక రూపొందించాడు. ఇంజనీరింగ్ చదువుతున్న షేక్ అభిషేక్, అవసరాల సత్యసూర్యకుమార్, పరపతి ప్రమోద్‌కుమార్‌తో కలసి దోపిడీకి సిద్ధపడ్డాడు. కృష్ణకాంత్‌రెడ్డి తండ్రి ఓ శుభకార్యానికి హాజరుకావడానికి ఈనెల నాలుగున హైదరాబాద్‌కు వెళ్లారు. ఐదో తేదీ అర్ధరాత్రి దోపిడీకి స్కెచ్ వేశారు. దీనికోసం ముందుగానే కృష్ణకాంత్‌రెడ్డి తన ఇంట్లో సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశాడు. కింది పోర్షన్‌లో తాను, నానమ్మ ఉంటామని, పై పోర్షన్‌లో తల్లి, చెల్లి ఉంటారని ముందే ఫ్రెండ్స్‌కు చెప్పాడు.
కింది పోర్షన్‌లో వెనుక వైపు తలుపునకు గడియ పెట్టకుండా వదిలేశాడు. లోపలికి వచ్చిన వెంటనే తనతోపాటు తన నానమ్మ నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు ప్లాస్టర్లతో బంధించాలని, హిందీలోనే మాట్లాడాలని ఫ్రెండ్స్‌కు సూచించాడు. ఆ ప్లాన్ ప్రకారమే స్నేహితులు ఇంట్లోకి చొరబడి ముందుగా అతడి నానమ్మను బంధించి మెడలోని ఆభరణాలను లాక్కున్నారు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లోని బీరువాలో బంగారం, నగదుని తస్కరించారు. దోపిడీ తర్వాత ఇంటి ముందు ఉన్న కారును తీసుకుని సీసీ కెమెరాలు పెద్దగా లేని ఎన్‌ఏడీ, సింహాచలం, హనుమంతవాక మీదుగా మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్యంగా ఉన్నచోట కారు వదిలేశారు. అక్కడి నుంచి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని విజయవాడ, హైదరాబాద్‌లకు వెళ్లారు. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సెల్‌ఫోన్ డేటా ద్వారా కృష్ణకాంత్‌రెడ్డే సూత్రధారి అని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పోలీసులు చోరీసొత్తుతో సహా అరెస్టు చేశారు. మూడు రోజుల్లో దోపిడీ కేసును ఛేదించిన కంచరపాలెం క్రైమ్ పోలీసులు, సీసీఎస్ పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో క్రైమ్ ఏడీసీపీ లతామాధురి, ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి పాల్గొన్నారు.