High Court: స్టిల్ట్ ఫ్లోర్‌ను వాణిజ్య అవసరాలకు వాడడానికి వీల్లేదు
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:39 AM
అపార్ట్‌మెంట్లలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్టిల్ట్ ఫ్లోర్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
అది అపార్ట్‌మెంట్ ఓనర్లు, నివాసితులు
ఉపయోగించుకొనే కామన్ ఏరియా
అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించొద్దు: హైకోర్టు
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్లలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్టిల్ట్ ఫ్లోర్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. సెల్లార్, స్టిల్ట్‌ఫ్లోర్, పార్కింగ్ కోసం ఉద్దేశించిన కామన్ ఏరియాలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని అనుమతించలేమని పేర్కొంది. ఏపీ అపార్ట్‌మెంట్ యాక్ట్-1987లోని సెక్షన్ 9 ప్రకారం పార్కింగ్ ప్రాంతాన్ని అపార్ట్‌మెంట్‌లో ఉండే ఫ్లాట్ల యజమానులు, అందులో నివాసం ఉండేవారు ఉపయోగించుకొనే కామన్ ఏరియాగా నిర్వచించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టిల్ట్ ఫ్లోర్‌లో జరిపిన అనధికార నిర్మాణాలను ఏ అధికారీ క్రమబద్ధీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కామన్ ఏరియాగా వినియోగించే స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వీలుగా మార్చి విక్రయించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తుచేసింది. ప్రస్తుత కేసులో అనుమతించిన అపార్ట్‌మెంట్ ప్లాన్‌కు విరుద్ధంగా స్టిల్ట్ ఫ్లోర్‌లో అక్రమంగా షాపులు నిర్మించారని, గత రెండున్నర దశాబ్దాలుగా అవి తమ ఆధీనంలో ఉన్నాయనే కారణంతో క్రమబద్ధీకరించాలని, చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్లు కోరలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని మాధురి మనోర్ అపార్ట్‌మెంట్ స్టిల్ట్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలను కూల్చివేసి, నాలుగు వారాల్లో స్థలాన్ని ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అప్పగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు.
అసలు కేసు ఏంటి?
విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని మాధురి మనోర్ అపార్ట్‌మెంట్‌లోని స్టిల్ట్ ఫ్లోర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని గతేడాది డిసెంబర్ 12న జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ ఈదర్లపల్లి బాలసుబ్రహ్మణ్యం, నడింపల్లి శ్రీ దివ్యదుర్గ మధులిక అనే ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. 1998, 1999లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా బిల్డర్ నుండి 6 షాపులను తాము కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం అనధికార నిర్మాణాలను క్రమబద్దీకరించవచ్చన్నారు. షాపులను క్రమబద్ధీకరించాలని జీవీఎంసీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించామని, దానిని పరిగణనలోకి తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జీవీఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ ఏఎ్‌ససీ బోస్, మాధురి మనోర్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు సమర్పించిన శాన్‌క్షన్డ్ ప్లాన్ నకిలీది అన్నారు. వ్యాజ్యం వేసేందుకు వీలుగా బిల్డింగ్ ప్లాన్ తయారు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్లకు షాపులు విక్రయించిన వారు బిల్డింగ్ నిర్మాణంలో భాగస్వాములని స్పష్టమౌతుందన్నారు. పిటిషనర్లు సృష్టించిన శాన్‌క్షన్డ్ ప్లాన్‌ను కోర్టు ముందు ఉంచడాన్ని తప్పుపట్టారు. సెల్లార్, స్టిల్ట్‌ఫ్లోర్, పార్కింగ్ కోసం ఉద్దేశించిన కామన్ ఏరియాను వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.