క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:01 AM
ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు.
రోగ నిర్ధారణ చేయడంలో పెథాలజి విభాగం కీలకం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్
పెథాలజి వైద్యుల రాష్ట్ర సదస్సు ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీ న్యూలెక్చరర్ గ్యాలరీలో ఇండియన అసోసియేషన ఆఫ్ పెథాలజి అండ్ మైక్రో బయాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెథాలజి వైద్యుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జీజీహెచ సూపరింటెం డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఇనచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ హరిచరణ్, ఐఏపీఎం రాష్ట్ర అద్యక్షురాలు డాక్టర్ నీరజరెడ్డి, ఏపీ పాథ్కాన ఆర్గనైజింగ్ చైర్మన పెథాలజి హెచవోడీ డా.బాలీశ్వరితో కలిసి ఆయన రాష్ట్ర సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శరీరంలోని వ్యాధులను రోగ నిర్ధారణ చేయడంలో పెథాలజి విభాగం ఎంతో కీలకమైందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్యరంగంలో నూతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతున్నామన్నారు. అందుకు అనుగుణంగా పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో పరిశోధన కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీజీ వైద్య విద్యార్థుల కోసం రీసెర్చ్ కోసం రూ.10 కోట్లు, మెడికల్ వైద్యులకు రూ.2లక్షల యూజీ ఉపకారవేతనాల కోసం రూ.70లక్షలు కేటాయిస్తున్నామన్నారు. రోగుల వ్యాధు లను గుర్తించి వైద్యం అందించడంలో పెథాలజి వైద్యులు అందించే రిపోర్టులే కీలకమని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. పెథాలజి గతంలో కన్నా ఇప్పుడు ఎంతో పురోగతి సాదించిందన్నారు. రోగులకు ఆపరేషన చేయాలన్నా వైద్యం అందించాలన్నా పెథాలజి వైద్యులు సహకారం తప్పనిసరి అని డాక్టర్ హరిచరణ్ అన్నారు. రాష్ట్ర స్థాయి పెథాలజి సదస్సు కర్నూలు మెడికల్ కాలేజీ లో నిర్వహించడం యువ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ బాలీశ్వరి పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డు వీసీ డా.ఏవీ కృష్ణమరాజు, ఐఏపీఎం సెక్రటరీ డా.మారుతి, అబ్జర్వర్ డా.శ్రీనివాసులు, కోశాధికారి డా.కుమార్ రాజు, విభాగాధిపతి పీవీ రమణబాబు, వైద్యులు అసోసియేట్ ప్రొపెసర్ డా.రేవతి, ఏపీ, తెలంగాణలకు చెందిన పెథాలజి వైద్యులు పాల్గొన్నారు.