Share News

అభివృద్ధి వైపు అడుగులు

ABN , Publish Date - May 13 , 2025 | 12:56 AM

రాజధాని అమరావతికి గేట్‌వే (ముఖద్వారం)గా ఉన్న జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇండసి్ట్రయల్‌ సెక్టార్‌తో పాటు ఐటీ, డిఫెన్స్‌ అకాడమీలను తీర్చిదిద్దాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇక్కడి ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారు.

అభివృద్ధి వైపు అడుగులు

- ఇండసి్ట్రయల్‌, ఐటీ, డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటుకు రంగం సిద్ధం!

- జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో భూముల అన్వేషణ

- క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించిన కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు

(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల):

రాజధాని అమరావతికి గేట్‌వే (ముఖద్వారం)గా ఉన్న జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇండసి్ట్రయల్‌ సెక్టార్‌తో పాటు ఐటీ, డిఫెన్స్‌ అకాడమీలను తీర్చిదిద్దాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇక్కడి ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను పరిశీలించారు. ఈ రెండు నియోజకవర్గాలు 65వ నెంబర్‌ జాతీయ రహదారికి, ప్రతిపాదిత ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు, రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటం, కృష్ణానది చెంతనే ఉండటం వల్ల నీటికి కొరత లేకపోవటం, సిమెంట్‌, ఇసుక, మెటల్‌ పుష్కలంగా ఉండటం వల్ల వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ రెండు నియోజకవర్గాల్లో ఐటీ, డిఫెన్స్‌, ఇండసి్ట్రయల్‌ సెక్టార్లు అభివృద్ధి చేయాలనే తలంపుతో శరవేగంగా పావులు కదుపుతున్నారు. పెద్ద ప్రాజెక్టులు తీసుకురావాలన్న పట్టుదలతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కూడా ఉన్నారు.

జయంతిపురంలో 498 ఎకరాలు

జగ్గయ్యపేట మండలం జయంతిపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 94లో 498.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నెల రోజుల క్రితం ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, అధికారులు ఇక్కడకు వచ్చి ఈ భూములను పరిశీలించి వెళ్లారు. జయంతిపురం రెవెన్యూ పరిధిలోనే సర్వే నెంబర్‌ 65లో 365 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిపై వివాదం నెలకొనటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూమి ప్రభుత్వానిది కాదని, తమకు హక్కు ఉందంటూ గ్రామానికి చెందిన ఎస్టీలు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి తమదే అంటూ ప్రభుత్వం పేర్కొంటుంది. వేదాద్రి దగ్గర మరో ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూముల చుట్టు పక్కల ఉన్న మరో మూడు వందల ఎకరాల ప్రైవేట్‌ భూములను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే అధికారులు సర్వే చేసి మూడు వందల ఎకరాల భూములను గుర్తించారు. భూసేకరణ ద్వారా రైతుల నుంచి స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నారు. మొత్తం వెయ్యి ఎకరాలను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు అప్పగించాలన్న ఆలోచనలో పాలకులు ఉన్నారని సమాచారం. జగ్గయ్యపేట ప్రాంతంలోని ఈ భూములను కొద్దిరోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, కలెక్టర్‌ లక్ష్మీశ తదితరులు పరిశీలించారు.

పెద్దవరంలో మరో 1,120 ఎకరాలు

నందిగామ మండలం పెద్దవరం గ్రామ రెవెన్యూ పరిధిలో 1,120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మైనర్‌ సర్క్యూట్‌ లాండ్‌ కావటంతో ఎక్కువ భాగం కొండలు, గుట్టలుగా ఉంది. ఈ భూమిలో 515 ఎకరాలను దశాబ్ధం క్రితమే ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించింది. కోట్లాది రూపాయల వ్యయంతో గుట్టలు, కొండలను చదును చేసి, రోడ్లు, నీరు, విద్యుత తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా అభివృద్ధి చేశారు. అయితే గత ప్రభుత్వ హాయాంలో వైసీపీ పెద్దల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రామన్నపేట (గుడిమెట్ల) పరిధిలో 250 నుంచి మూడు వందల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. మరో మూడు వందల ఎకరాల వరకు అటవీ భూమి ఉంది. ఈ భూమిని తీసుకునేందుకు డీ నోటిఫై చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి స్థానిక అధికారులు, ప్రభుత్వ భూమి వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు.

Updated Date - May 13 , 2025 | 12:56 AM