క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:14 AM
రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కేజీహెచ్‌తోపాటు రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో...
కేజీహెచ్‌లో అత్యాధునిక చికిత్సా పరికరాలు ప్రారంభం
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అందులో భాగంగానే కేజీహెచ్‌తోపాటు రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు కేజీహెచ్‌లో సుమారు రూ.42 కోట్లతో ఏర్పాటుచేసిన లీనియర్ యాక్సిలరేటర్ (రూ.25 కోట్లు), సిటీ సిమ్యులరేటర్ (రూ.9.5 కోట్లు), బ్రాకీ థెరపీ (రూ.7.5 కోట్లు) పరికరాలను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు ఆధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు ఈ పరికరాలను అందించామన్నారు. ఇప్పటివరకూ ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై కేజీహెచ్‌లోనే ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తాయన్నారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. కర్నూలులో సమగ్ర క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసేందుకు గతంలో నిధులు కేటాయించామని, అలాగే కేజీహెచ్‌తో పాటు మరో రెండుచోట్ల కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.