Minister Kondapalli Srinivas: కొబ్బరి రైతుల ఆదాయం పెంచుతాం
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:54 AM
కొబ్బరి ఉత్పత్తులకు అదనపు విలువను జోడించి కొబ్బరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు..
ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు
కోనసీమ జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కొబ్బరి ఉత్పత్తులకు అదనపు విలువను జోడించి కొబ్బరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. కొబ్బరి పరిశ్రమ అభివృద్ధిపై మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొబ్బరి పంట అధికంగా ఉన్న డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం ఉప్పలగుప్తం, పెదపట్నం లంకల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేసి, కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేశామని వివరించారు. వీటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవోను ఆదేశించారు. కొబ్బరి పొడి, నూనె, పాలు వంటి కొబ్బరి ఆధారిత ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంతోపాటు, వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజోలు నియోజకవర్గంలో 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉందని, ఇక్కడ ఏటా 30-40 కోట్ల కొబ్బరి కాయల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. కోనసీమ జిల్లాలో కొబ్బరి ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తమ కొబ్బరి కాయల తొక్కలు తీసి, ఎండు కొబ్బరి కాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే కొబ్బరికి అదనపు విలువను జోడించేందుకు అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టరును మంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుకు వచ్చారని, ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టరును కోరారు.