AP Govt: రాష్ట్రంలో డీఈవోల బదిలీలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:38 AM
రాష్ట్రంలోని పలువురు జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
పలు జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్థానచలనం
మరికొందరికి డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు
అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలువురు జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారిగా ఎ.రవిబాబు నియమితులయ్యారు. ఈయన అదే జిల్లా డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవో పి.బ్రహ్మాజీరావును పార్వతీపురం మన్యం జిల్లా డీఈవోగా బదిలీ చేశారు. విజయనగరంలోని డైట్ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కె.రామకృష్ణారావుకు అల్లూరి జిల్లా డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కోనసీమ డీఈవో ఆఫీసు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న పి.నాగేశ్వరరావుకు అదే జిల్లా డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి డీఈవో ఎస్.కె.సలీం బాషాను గుంటూరు డీఈవోగా బదిలీ చేశారు. గుంటూరు డీఈవో సి.వి.రేణుకను ప్రకాశం డీఈవోగా పంపించారు. ప్రకాశం డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బోయపాలెం డైట్ కాలేజీ సీనియర్ లెక్చరర్ ఎ.కిరణ్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో డీఈవోగా పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ యు.వి.సుబ్బారావును కృష్ణా జిల్లా డీఈవోగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న పి.వి.జె.రామారావును గుంటూరు జిల్లా బోయపాలెంలోని డైట్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతోపాటు పల్నాడు జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఇప్పటి వరకు గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ ప్రిన్సిపాల్‌గా, పల్నాడు జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎల్.చంద్రకళను కృష్ణా జిల్లా అంగలూరు డైట్ ప్రిన్సిపాల్‌గా నియమించడంతోపాటు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారికగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాపట్ల జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సింగ్ శ్రీనివాస్‌కు అదే జిల్లా డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఎస్.పురుషోత్తమ్‌ను రిలీవ్ చేశారు. బుక్కపట్నంలోని డైట్ సీనియర్ లెక్చరర్ కె.రాజేంద్రప్రసాద్‌కు చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన బి.వరలక్ష్మిని చిత్తూరు జిల్లా కార్వేటినగర్‌లోని డైట్‌కు రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా నియమించారు. భీమునిపట్నంలోని డైట్ సీనియర్ లెక్చరర్ ఎల్.సుధాకర్‌కు కర్నూలు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.శామ్యూల్ పాల్‌ను రిలీవ్ చేశారు.