Share News

States Debt Crisis: అప్పుల ఊబిలో రాష్ట్రాలు

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:22 AM

దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గడిచిన దశాబ్దంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడురెట్లు పెరిగిపోవడంపై కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌) ఆందోళన వ్యక్తం చేసింది.

States Debt Crisis: అప్పుల ఊబిలో రాష్ట్రాలు

  • దశాబ్దంలో మూడురెట్లు పెరిగిన రుణభారం

  • 59.60 లక్షల కోట్ల అప్పులతో కుంగుబాటు

  • ఆందోళన వ్యక్తం చేసిన కాగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గడిచిన దశాబ్దంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడురెట్లు పెరిగిపోవడంపై కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. కాగ్‌ తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదిక ప్రకారం... 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలోని 28 రాష్ట్రాల అప్పులు రూ.17.57 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి ఈ మొత్తం రూ.59.60 లక్షల కోట్లకు చేరింది. అంటే.. పదేళ్లలో 3.3 రెట్లకు పైగా పెరిగింది. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం రుణాల చెల్లింపులు, వడ్డీలకే పోతోంది. జీఎస్డీపీతో పోల్చితే 2013-14లో 16.66 శాతంగా ఉన్న రుణాలు 2022-23 నాటికి దాదాపు 23 శాతానికి పెరిగాయి. ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శుల సమావేశంలో కాగ్‌ అధిపతి కె.సంజయ్‌ మూర్తి ఈ వివరాలు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాలు భారీగానూ, మరికొన్ని పరిమితికి లోబడి రుణాలు తీసుకుంటున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. పంజాబ్‌ అప్పులు-జీఎస్డీపీ నిష్పత్తి అత్యధికంగా 40.35 శాతం నమోదు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో నాగాలాండ్‌ (37.15ు), పశ్చిమబెంగాల్‌ (33.70ు) ఉన్నాయి. ఈ నిష్పత్తి తక్కువ నమోదైన రాష్ట్రాలుగా ఒడిసా (8.45ు), మహారాష్ట్ర (14.64ు), గుజరాత్‌ (16.37ు) నిలిచాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల మొత్తం అప్పు దేశ జీడీపీలో 22.17 శాతానికి సమానమని కాగ్‌ తెలిపింది. 2023లో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, బిహార్‌, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు తాము తెచ్చిన రుణాల్లో కొంతభాగాన్ని మూలధన వ్యయానికి బదులుగా రెవెన్యూ లోటు తీర్చడానికి ఖర్చు చేశాయి.


ఏపీ, పంజాబ్‌ల్లో మూలధన వ్యయం నికర రుణాల్లో వరుసగా 26 శాతం, 17 శాతంగా మాత్రమే ఉంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు సేకరించిన రుణాల్లో సగమే మూలధన ప్రాజెక్టులకు కేటాయించాయి. నిర్వహణ ఖర్చుల కోసం కాకుండా పెట్టుబడుల కోసమే అప్పులు సేకరించాలన్న ‘గోల్డెన్‌ రూల్‌’ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని కాగ్‌ నివేదిక వెల్లడించింది.


కేంద్రానిది నిర్బంధ సమాఖ్యవాదం: కాంగ్రెస్‌

రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని హరించి, వాటిని మున్సిపాలిటీల స్థాయికి తగ్గించడం ద్వారా కేంద్రం నిర్బంధ సమాఖ్యవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయంటూ కాగ్‌ విడుదల చేసిన నివేదికపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సుర్జేవాలా శనివారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశ సమాఖ్య విధానం ఇంతకుముందెన్నడూ లేనంత ఒత్తిడిలో ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రాల అప్పుల భారం దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిందని, ఇప్పుడు జీఎస్టీ సెస్‌, ఏకపక్ష సుంకాలతో అవి ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న ఆదాయాలతో ఈ ప్రమాదం రెట్టింపైందని తెలిపారు. సహకార సమాఖ్యవాదం, అధికార వికేంద్రీకరణకు ముప్పు వాటిల్లుతోందని, రాష్ట్రాల అధికారాలను హస్తగతం చేసుకోవడానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Updated Date - Sep 21 , 2025 | 04:25 AM