Share News

Rayapati Sailaja: మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:34 AM

ఆడవాళ్లంతా తాగుబోతులు అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు.

Rayapati Sailaja: మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి

  • బొల్లా బ్రహ్మనాయుడుకు మహిళా కమిషన్‌ సూచన

  • లేదంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘ఆడవాళ్లంతా తాగుబోతులు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. బ్రహ్మనాయుడి వ్యాఖ్యలపై మీడియాలో దుమారం రేగడంతో ఆమె స్పందించారు. మహిళలను అవమానపరుస్తూ చేసిన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళల పట్ల ఉన్న చులకనభావం అర్థమవుతోందన్నారు. మహిళలను అగౌరవపరిచినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, అలా చేయకుంటే కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల మాటలు ఆదర్శవంతంగా ఉండాలిగానీ ప్రజలు అసహ్యించుకునేలా ఉండకూడదని సూచించారు. సంస్కారవంతులెవరూ బ్రహ్మనాయుడిలా మాట్లాడరని, మహిళలను అవమానించే నాయకులు ప్రజా సేవకు అనర్హులని తేల్చిచెప్పారు. మహిళలపై ఎవరైనా వ్యాఖ్యలు చేసేముందు వారింట్లో తల్లి, చెల్లి, భార్య, నిత్యం పూజించే దేవత కూడా మహిళే అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి వ్యాఖ్యనూ కమిషన్‌ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. మహిళల్ని తూలనాడే రాజకీయనేతలపై నిఘా పెట్టి ప్రభుత్వ పెద్దలు సైతం ఇలాంటి విష సంస్కృతిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 05:35 AM