Share News

Education System : స్కూళ్లు.. సవాళ్లు

ABN , Publish Date - Mar 19 , 2025 | 04:52 AM

రాష్ట్రంలో పాఠశాల విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25లో మొత్తంగా 2,63,094 మంది విద్యార్థులు తగ్గిపోయారు.

Education System : స్కూళ్లు.. సవాళ్లు

  • బడులకు దూరంగా పిల్లలు

  • ఏటా భారీగా తగ్గుతున్న విద్యార్థులు

  • ఒక్క ఏడాదిలో 2.63 లక్షల మంది తగ్గుదల

  • ప్రాథమిక స్థాయిలో పడిపోతున్న అడ్మిషన్లు

  • ప్రాథమికోన్నత, ఉన్నతస్థాయిలోనూ అంతే

  • బాలికల విద్యలోనూ ప్రతికూల గణాంకాలు

  • ప్రభుత్వ-ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి

  • దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ ప్రయోగాలు

  • జననాల రేటు తగ్గుదల కూడా కారణమే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పాఠశాల విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25లో మొత్తంగా 2,63,094 మంది విద్యార్థులు తగ్గిపోయారు. వీరిలో ప్రాథమికోన్నత స్థాయిలో 64,830 మంది, ఉన్నత పాఠశాల స్థాయిలో 76,564 మంది విద్యార్థులు తగ్గారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 1,21,700 మంది విద్యార్థులు తగ్గిపోవడం గమనార్హం. దీంతో పాఠశాల విద్య క్రమంగా వృద్ధిరేటుకు వ్యతిరేక దిశలో సాగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ-ప్రైవేటు.. అంతే!

వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యపై చేసిన ప్రయోగాలతో కొన్నేళ్లుగా స్కూళ్లలో విద్యార్థుల సం ఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఐదేళ్లలో పాఠశాల స్థా యిలో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారని మంత్రి లోకేశ్‌ పలుమార్లు ప్రకటించారు. అయితే, వారిలో అందరూ ప్రైవేటు బడులకు వెళ్లలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 58,592 పాఠశాలలున్నాయి. వాటిలో 45 వేలు ప్రభుత్వ పాఠశాలలు. అన్నిట్లో కలిపి 2023-24 విద్యా సంవత్సరంలో 71,14,839 మంది విద్యార్థులు చదివారు. 2024-25లో ఆ సంఖ్య 68,51,745కు తగ్గింది. అంటే 2,63,094 మంది విద్యార్థులు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడా లేరు. ఇక, వైసీపీ హయాంలో విద్యార్థుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది. 2020-21లో 73,12,852 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివారు. 2023-24 నాటికి వీరిలో 1,98,013 మంది తగ్గిపోయారు. గత ప్రభుత్వ చర్యల ఫలితంగా 2024-25 విద్యా సంవత్సరంలోనూ తగ్గుదల కొనసాగింది.


జననాల రేటు తగ్గుదల

ప్రతి సంవత్సరం పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు బడి నుంచి బయటికి వెళ్తారు. మరోవైపు ఒకటో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో ఆ సంఖ్య భర్తీ అవుతుంది. కానీ, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2015-16లో జననాల రేటు 1.7గా ఉంటే, 2019-20 నాటికి అది 1.5కు పడిపోయింది. అది ఒకటో తరగతిలో చేరికలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఒకసారి బడిలో చేరిన విద్యార్థి ఆపై తరగతికి వెళ్లకపోవడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటో తరగతిలో చేరిన తర్వాత పిల్లలు ప్రతి ఏటా ఆ తర్వాత తరగతికి ప్రమోట్‌ అవుతారు. అలా పైతరగతులకు వెళ్లకుండా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 64,830 మంది, ఉన్నత పాఠశాలల్లో 76,564 మంది తగ్గిపోయారు. వారు అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా చదవడం లేదు. ఓవైపు కొత్తగా ఒకటో తరగతిలో చేరేవారి సంఖ్య తగ్గుతుంటే, మరోవైపు చదువుతున్న పిల్లలు బడి మానేయడం ప్రతికూల ఫలితాలను ఇస్తోంది.

బాలికల సంఖ్యా తగ్గింది

పాఠశాలల్లో బాలికల సంఖ్య మరింత తగ్గిపోతోంది. 2023-24లో పాఠశాలల్లో చదివే బాలికల సంఖ్య 34,14,383గా ఉంటే, 2024-25లో 33,14,129కి తగ్గింది. 2013-14లో 35.44 లక్షల మంది బాలికలు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య పెరగకపోగా 2 లక్షలకుపైగా తగ్గింది. 2023-24తో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిది, పది తరగతుల్లో 36,934 మంది తగ్గిపోయారు. 1 నుంచి 5 తరగతుల్లో ఏకంగా 72,180 మంది బాలికలు తగ్గారు.


దెబ్బకొట్టిన జగన్‌ ప్రయోగాలు

  • విద్యా రంగంలో చేసే సంస్కరణలు విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు పాఠశాల విద్యను అస్తవ్యస్తం చేశాయి.

  • ప్రధానంగా జీవో 117 ద్వారా తరగతులను విలీనం చేయడం విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆరేడేళ్ల వయసులో బలవంతంగా పిల్లల్ని బడులు మార్చడం తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బంది పెట్టింది. అలా బడి మారే క్రమంలో కొందరు మొత్తానికే చదువుకు దూరమయ్యారు.

  • సబ్జెక్టు టీచర్ల విధానంపై తీసుకొచ్చిన అనాలోచిత విధానం ప్రాథమికోన్నత పాఠశాలలను దెబ్బతీసింది.

  • 1 నుంచి 7 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 నుంచే విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లతో బోధిస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం విద్యార్థులు సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలల్లో 6, 7 తరగతులకు కూడా సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఇచ్చింది.

  • సాధారణంగా ప్రాథమిక పాఠశాల దాటి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు 6వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లే బోధిస్తారు. కానీ, 3 నుంచే సబ్జెక్టు టీచర్లు అని చెప్పి చివరికి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో 6, 7 తరగతుల కూడా సబ్జెక్టు టీచర్లను తొలగించడం గందరగోళానికి దారితీసింది.

Updated Date - Mar 19 , 2025 | 04:52 AM