Share News

Employee Promotions: పదోన్నతి తీర్పు అమలు చేస్తాం!

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:08 AM

ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంపై 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, అయితే.. దీనికి మరో నాలుగువారాల గడువు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌......

Employee Promotions: పదోన్నతి తీర్పు అమలు చేస్తాం!

  • ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం చూస్తోంది

  • పరిష్కార మార్గాన్ని మంత్రులు పరిశీలిస్తున్నారు

  • 4 వారాల టైమ్‌ ఇవ్వండి: హైకోర్టుకు ఏజీ వినతి

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పదోన్నతి కల్పించే విషయంపై 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, అయితే.. దీనికి మరో నాలుగువారాల గడువు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఇది రెండు గ్రూపుల మధ్య వ్యహారమని, పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం(జీవోఎం) ఏర్పాటు చేసిందని, ఈ వ్యవహారం తుది దశలో ఉందని తెలిపారు. గతంలో కార్యదర్శులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికలో పదోన్నతులు కల్పించేందుకు ఎన్ని సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించాలనే విషయంపై సరైన లెక్క లేదని, ఆ అంశాన్ని తేల్చాల్సి ఉందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణకు సీఎస్‌, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకు మినహాయింపు ఇచ్చింది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు ఉద్యోగులు 2016, 2017లో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు పదోన్నతుల్లో అన్ని వర్గాల ఉద్యోగులకు తగినంత ప్రాతినిధ్యం ఉందా? లేదా? అనే విషయాన్ని కనీస అధ్యయనం చేయకుండా రిజర్వేషన్‌ కల్పించారని తప్పుబట్టింది. బాధిత ఉద్యోగుల వాదనలు విని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కి అనుగుణంగా ప్రతి ఉద్యోగి పదోన్నతిని సమీక్షించాలని 2018, డిసెంబరు 11న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో ‘ది సెక్రెటేరియట్‌ బీసీ అండ్‌ ఓసీ ఎంప్లాయీస్‌’ అసోసియేషన్‌, మరికొందరు ఉద్యోగులు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లు ఇటీవల విచారణకు రాగా పదోన్నతుల కల్పన విషయంలో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా తమ ముందు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.ఎం. నాయక్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర సీఎస్‌, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సోమవారం ధర్మాసనం ముందు హాజరయ్యారు. విచారణ ప్రారంభమైన వెంటనే ఏజీ స్పందిస్తూ.. ఉత్తర్వుల అమలుకు చివరి అవకాశంగా మరో 4 వారాల సమయం ఇవ్వాలని అభ్యర్ధించారు. ఇది రెండు గ్రూపుల మధ్య వ్యవహారమన్నారు.

అలా అయితేనే గడువు

ఉద్యోగుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ... సచివాలయ ఉద్యోగుల పదోన్నతి విషయంలో మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని 33శాఖల్లో ఉన్న ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే ఏజీ కోరినట్లు 4 వారాల సమయం ఇస్తే అభ్యంతరం లేదన్నారు. తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం కమిటీలు వేసి కాలయాపన చేస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పదోన్నతుల కల్పన విషయంలో ఉత్తర్వులు ఇచ్చి ఏళ్లు గడిచిందని గుర్తు చేసింది. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుని విచారణను జనవరి 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Dec 16 , 2025 | 03:08 AM