SIPC Approves: 1.03 లక్షల కోట్ల పెట్టుబడులు.. 83 వేల ఉద్యోగాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:24 AM
రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. రూ. 1,03,389 కోట్ల పెట్టుబడులతో 83,436 మందికి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
కంపెనీల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం
ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగంలోభారీగా పెట్టుబడులు
22,976 కోట్లతో ఇండిచిప్ సెమీ కండక్టర్ ప్లాంట్
7న ఎస్‌ఐపీబీ ముందుకు
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. రూ. 1,03,389 కోట్ల పెట్టుబడులతో 83,436 మందికి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచశ్రేణి సంస్థలు ముందుకు వచ్చాయి. రూ.22,976 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్‌లో స్థాపించే ఇండిచిప్ సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. ఈ సంస్థకు ఎకరా రూ.10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు వల్ల 1,241 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఎస్‌ఐపీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెట్టుబడులను ఈనెల 7న సీఎం అధ్యక్షతన జరగనున్న రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనలనకు ఈనెల 10న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదముద్ర వేస్తారు.
ఎస్‌ఐపీసీ ఆమోదించిన ప్రతిపాదనలు ఇలా..
కర్నూలు జిల్లాలో 250 మెగావాట్ల డీసీ సోలార్ ప్రాజెక్టును ఎస్‌ఐఈఎల్ సోలార్ సంస్థ రూ. 1,728 కోట్లతో స్థాపించడం ద్వారా 860 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చిట్టంవలసలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును 800 మెగావాట్ల నుంచి 1,800 మెగావాట్లకు రూ. 7,972 కోట్లతో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ విస్తరిస్తుంది. దీంతో 2,700 మందికి ఉద్యోగాలొస్తాయి.
అనకాపల్లి జిల్లాలో రీన్యూ ఎనర్జీ 170 మెగావాట్ల విండ్‌సోలార్ హైబ్రీడ్, 50 మెగావాట్ల విండ్, 120 మెగావాట్ల డీసీ సోలార్, 200 మెగావాట్ల బీఈఎ్‌సఎస్ పవర్ ప్లాంట్‌ను రూ.1,461 కోట్లతో స్థాపిస్తుంది. 775 మందికి ఉద్యోగాలు.
రిలయన్స్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల విక్రయం కోసం రూ. 202 కోట్లతో 436 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదన చేసింది.
మైరాబే వ్యూ రిసార్ట్స్ రూ. 157 కోట్లతో స్థాపించే ప్రాజెక్టులో 980 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టూరిజం పాలసీలో భాగంగా భూమి కేటాయించాలన్న అభ్యర్థనకు ఆమోదం లభించింది. అలాగే, విశ్వనాథ్ కన్సార్టియం అండ్ కన్వెన్షన్ రూ. 51 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, ఎస్వీన్ హోటల్స్ అండ్ రీసార్ట్స్‌కు, రూ. 225 కోట్లతో నిర్మించే పీవీఆర్ హోటల్స్, రూ.348 కోట్ల పెట్టుబడి పెట్టే మైలాన్ లీజర్స్‌కు భూముల కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని కాసానుపల్లిలో రూ. 1,340 కోట్లతో 360 మందికి ఉద్యోగాలను ఇచ్చే చెట్టినాడ్ సిమెంట్స్‌కు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు సంసిద్ధత.
సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.1,247 కోట్లతో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్‌కూ ఆమోదం. 1100 మందికి ఉపాధి.
విజయనగరంలో రూ. 8,570 కోట్లతో 1,000 మందికి ఉద్యోగాలను కల్పించే సూపర్ స్మెల్టర్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు స్థాపిస్తుంది.
నాయుడుపేటలో వోల్ట్సన్ ల్యాబ్స్ రూ.1,682 కోట్లతో 415 మందికి ఉద్యోగాలు కల్పించే సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్‌కు ఆమోదం లభించింది.
రూ.44,000 కోట్లతో ఏఎంజీ మెటల్స్ గ్రీన్ అల్యూమినియం స్మెల్డర్స్ తయారీ కోసం 250 ఎకరాలను కేటాయించేందుకు ఆమోదం.
నెల్లూరు జిల్లాలోని కడలూరు మండలం, బొడ్డువారిపాలెంలో 240 కోట్లతో 588 మందికి ఉద్యోగాలు కల్పించే గ్రీన్‌ఫీల్డ్ ఫైబర్ బోర్డు ప్లాంట్‌కు ఎస్‌ఐపీసీ సమ్మతి తెలిపింది.
రూ. 700 కోట్లతో 1,000 మందికి ఉపాధి కల్పించేందుకు ఎపిటోమ్స్ కాంపోనెంట్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు, ఎపిఎస్పీఎల్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,081 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
రూ. 1,704 కోట్లతో 2,630 మందికి ఉద్యోగాలు కల్పించే ఎస్‌సీఐసీ వెంచర్స్‌కు, ఏఎన్‌ఎ్‌సఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విస్తరణ ప్రతిపాదనలను గ్రీన్‌సిగ్నల్ లభించింది.
ఫ్లుంటెగ్రిడ్ లిమిటెడ్ రూ.150 కోట్లతో 2,000 మందికి ఉద్యోగాలను ఇచ్చే ప్రతిపాదనకు, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 109.73 కోట్లతో 700 మందికి ఉపాధిని కల్పించే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది.
ఐస్ర్పోట్ బిజినెస్ సెంటర్‌ను రూ. 626.9 కోట్లతో స్థాపించి 12,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని పేర్కొంది.
క్వార్క్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 115 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనకూ ఆమోదం దక్కింది.
కె.రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 2,171 కోట్ల 9,681 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకూ ఎస్‌ఐపీసీ ఆమోదించింది.
ఐస్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ రూ. 119.18 కోట్లతో 2000 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. మొత్తంగా ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగంలో రూ. 32,953.81 కోట్ల పెట్టుబడితో 64,352 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదించింది.