State Level Bankers Association: మీ మూలధనం- మీ హక్కుపై ప్రచారం
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:19 AM
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ‘మీ మూలధనం- మీ హక్కు’ (యువర్ మనీ- యువర్ రైట్) అనే ప్రత్యేక ప్రచారాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి వెల్లడించింది.
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లపై నేటి నుంచి అవగాహన
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ‘మీ మూలధనం- మీ హక్కు’ (యువర్ మనీ- యువర్ రైట్) అనే ప్రత్యేక ప్రచారాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉన్న క్లెయిమ్ చేయని(అన్ క్లెయిమ్డ్) డిపాజిట్లను వాటి ఖాతాదారులు లేదా హక్కుదారులు తిరిగి పొందే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. దీనిపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ సీవీఎన్ భాస్కరరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో.. క్లెయిమ్ చేయని డిపాజిట్లపై బ్యాంకులు, బీమా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి, ఖాతాదారులకు నిద్ర ఖాతాలు, క్లెయిమ్ చేయని డిపాజిట్లు, వాటిని తిరిగి పొందే విధానంపై అవగాహన కల్పిస్తారు. రెండు, మూడు విడతల్లో భాగంగా నెల్లూరు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని భాస్కరరావు సూచించా రు. తద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చేసి, భారత ప్రభుత్వ ‘మీ మూలధనం- మీ హక్కు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.