చిట్ నిర్వాహకుల ఆస్తుల జప్తునకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:47 AM
ప్రైవేటు చిట్‌లు నిర్వహించి భారీ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితుల ఆస్తుల జప్తునకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన అంశం గుడివాడలో చర్చనీయాంశంగా మారింది.
- గతంలో ప్రైవేటు చిట్‌ల పేరుతో గుడివాడలో భారీ మోసం
- 27 మందికి రూ.78 లక్షల టోకరా
- ఆ నగదుతో భారీగా ఆస్తుల కొనుగోలు
- ఆ ఆస్తుల ఆటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ జీవో 156 జారీ
గుడివాడ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
ప్రైవేటు చిట్‌లు నిర్వహించి భారీ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితుల ఆస్తుల జప్తునకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన అంశం గుడివాడలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డులో నివాసముంటున్న నల్లమోతు భవానీ గత ఎనిమిదేళ్లుగా ప్రైవేట్ చిట్‌లను నిర్వహిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆమె చిట్‌ల నిర్వహణ బాధ్యతను తన బావ పాండురంగారావు కుమారుడు రామ్‌గోపాల్, కుమార్తె ప్రియాంకలకు అప్పగించింది. ప్రారంభంలో చిట్ పాడుకున్న వారికి సకాలంలో నగదు చెల్లించటంతో వీరిపై ప్రజలకు నమ్మకం పెరిగింది. అదే సమయంలో వీరికి డబ్బుపై ఆశ పెరిగింది. ఈ క్రమంలో చిట్‌ల చెల్లింపులో తాత్సరం చేయడం ఆరంభించారు. ఈ క్రమంలో బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ముగ్గురు నిర్వాహకులు పరారయ్యారు. దీంతో బాధితులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.
పోలీసుల ప్రత్యేక చొరవతో..
ప్రైవేట్ చిట్ నిర్వాహకుల పరారీపై వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ అప్పటి జిల్లా ఎస్పీ గంగారధరరావు ఆదేశాల మేరకు చిట్ ఫండ్ యాక్టు, సెక్షన్ 3 ప్రకారం కేసు నమోదు చేశారు. 30 మంది బాధితులను విచారించగా, 27 మంది బాధితులకు రూ.78 లక్షల మేర నగదును చెల్లించాల్సి ఉందని తేల్చారు. అదే విధంగా ముగ్గురు నిందితులు భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నట్లు విచారణలో నిర్ధారించారు. సదరు విషయాన్ని అప్పటి జిల్లా ఎస్పీ గంగాధరరావు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వాహకుల ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో ఆస్తుల జప్తు అనుమతుల నిమిత్తం రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖకు కలెక్టర్ నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర హోంశాఖ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు 1999 ప్రకారం నల్లమోతు ప్రియాంక, భవానీ, రామ్‌గోపాల్ ఆస్తుల అటాచ్ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముగ్గురు నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ నిమిత్తం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. న్యాయమూర్తి నిందితులు ఆస్తుల జప్తు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆస్తులను వేలం వేసి బాధితులకు చెల్లించే అవకాశాలున్నాయి.