Solar power project: 2 పవర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:16 AM
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం తీసుకొచ్చిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ....
శ్రీసత్యసాయి జిల్లాలో 1700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు
అనంతపురం జిల్లాలో 300 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టు
కుప్పంలో 10 టీపీడీ బయోగ్యాస్ ప్రాజెక్టుకూ ఓకే
ప్రభుత్వం ఉత్తర్వులు.. 24 నెలల్లో పూర్తిచేయాలని గడువు
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం తీసుకొచ్చిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024లో భాగంగా రాయలసీమ ప్రాంతంలో రెండు విద్యుత్తు ప్రాజెక్టులు, ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, గుడిబండ మండలాల్లోని గుడిబండ, కేకతి తదితర గ్రామాల్లో చింతా గ్రీన్ ఎనర్జీ సంస్థ 1700 మెగావాట్ల ఏసీ సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. సోలార్ ప్రాజెక్టుతోపాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్‌ను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారు. అనంతపురం జిల్లా కనేకల్, బొమ్మనహాళ్ మండలాల్లో గనేకో త్రీ ఎనర్జీ సంస్థ 300 మెగావాట్ల విండ్, సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 152 మెగావాట్ల పవన, 148 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
కుప్పంలో బయోగ్యాస్ ప్రాజెక్టు.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో శ్రేష్ఠ రెన్యువబుల్స్ సంస్థ 10 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో బయోగ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ సీబీజీతో పాటు 80 టీపీడీ ఫాస్పేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (పీఆర్‌ఓఎం)ను ఉత్పత్తి చేస్తారు. దీనికి 120 టీపీడీ నేపియర్ గ్రాస్‌ను, కుప్పం నియోజకవర్గంలో ఉత్పత్తయ్యే 30 టీపీడీ తడి చెత్తను బయోగ్యాస్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం జీవోలు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది.