AP Govt: పీ4 ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎస్‌వోపీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:04 AM
స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ (ఎస్‌ఏపీఎఫ్) ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలకు సంబంధించి ఎస్‌వోపీ (ప్రామాణిక కార్యచరణ విధానాలు) విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ (ఎస్‌ఏపీఎఫ్) ఆర్థిక, ఆర్థికేతర కార్యకలాపాలకు సంబంధించి ఎస్‌వోపీ (ప్రామాణిక కార్యచరణ విధానాలు) విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థికేతర కార్యకలాపాలకు ఎస్‌ఏపీఎఫ్ సీఈవో అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. పోర్టల్ ద్వారా మార్గదర్శి, బంగారు కుటుంబాల ఆమోదం పొందడం, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు ఉంటే చేపట్టడం, భాగస్వామ్య సంస్థలతో, వాలంటీర్లతో సమన్వయం చేసుకోవడం, ఎస్‌ఏపీఎఫ్ సిబ్బంది వ్యవహారాల అంశాలను సీఈవో అంతర్గతంగా నిర్వహిస్తారు. అదే విధంగా ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, ప్రాజెక్టు, చట్టపరమైన అంశాలపై ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తీసుకుంటారు. సీఎ్‌సఆర్ నిధులతో చేపట్టే విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, మౌలిక వసతుల ప్రాజెక్టుల ఆమోదం, పంచాయతీ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో భాగస్వామ్య సంస్థల నిధుల విడుదల, వినియోగం, కన్సల్టెంట్లు, వెండర్లను నియమించుకోవడం వంటివి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం ద్వారా చేపడతారు. రూ.50 లక్షలకు పైబడి నిధుల వినియోగానికి ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంటుంది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ-ఆఫీసును వినియోగించి ఫైల్ ప్రాసెస్ చేపడతారు.