స్టాంపింగ్ దోపిడీ!
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:06 AM
చౌక దుకాణాల కాటాల స్టాంపింగ్ విషయంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తమ అక్రమ వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల మైలవరంలో కాటాల స్టాంపింగ్ పేరుతో లైసెన్స్‌డ్ రిపేరర్లు అడ్డగోలుగా డబ్బులు దండుకున్నారు. స్టాంపింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- తూనికలు, కొలతల శాఖ లైసెన్స్‌డ్ రిపేరర్ల కక్కుర్తి!
- కాటాల స్టాంపింగ్‌లో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
- సర్వీస్ ప్రొవైడర్స్‌ను కాదని లైసెన్సింగ్ ఏజెన్సీలతో పనులు
- ఒక్కొక్కరి నుంచి రూ.1000 వసూలు
చౌక దుకాణాల కాటాల స్టాంపింగ్ విషయంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తమ అక్రమ వసూళ్ల పర్వం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల మైలవరంలో కాటాల స్టాంపింగ్ పేరుతో లైసెన్స్‌డ్ రిపేరర్లు అడ్డగోలుగా డబ్బులు దండుకున్నారు. స్టాంపింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-విజయవాడ:
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాలశాఖలో నూతన సంస్కరణలను ప్రవేశ పెట్టారు. పేదలకు ఇస్తున్న బియ్యంలో తూకం మోసాలను అరికట్టడానికి, జవాబుదారీ తీసుకురావటానికి వీలుగా అప్పటి వరకు ఉన్న రాళ్ల కాటాలను తొలగించి ఎలక్ర్టానిక్ కాటాలను ప్రవేశపెట్టారు. ఎలక్ర్టానిక్ కాటాలకు ఈ పోస్ యంత్రాన్ని అనుసంధానం చేసే విధానాన్ని తీసుకు వచ్చారు. ఈ విధానంతో రేషన్ దుకాణాల్లో అప్పటి వరకు తలెత్తే కాటాల మాయాజాలానికి తెరపడింది. మాన్యువల్ కాటాలను రెండు సంవత్సరాలకు ఒకసారి తనిఖీ చేసి తూకం రాళ్లకు సీల్ వేసే విధానం పోయి ఎలక్ర్టానిక్ కాటాలకు సంవత్సరానికి ఒక సారి సీల్ వేసే విధానం వచ్చింది. రేషన్ దుకాణాలకు ఇచ్చిన కాటాలను అప్పటి ప్రభుత్వం ‘కాల్ ఆన్ కంపెనీ’ నుంచి కొనుగోలు చేసింది. కాటాకు ఏవిధమైన మరమ్మతులు వచ్చినా ‘కాల్ ఆన్ కంపెనీ’ చేయాలి. కానీ సంవత్సరానికి ఒక సారి తూనికలు, కొలతల అధికారులు సీల్ పేరిట వచ్చి రేషన్ డీలర్ల నుంచి అక్రమంగా రూ. 1,000, 1,500 చొప్పున వసూలు చేసేవారు. గత ఏడాది ఇదే విషయంపై రేషన్ డీలర్ల సంఘాలు కమిషనరేట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు లైసెన్స్‌డ్ రిపేరర్లు, డీలర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. కాటాలు ప్రభుత్వానికి విక్రయించిన వారే రిపేర్లు, సర్వీస్ చేస్తున్నందున కాటా రిపేర్లు, సర్వీసింగ్, క్యాలిబరేట్ చేసినందుకు లైసెన్స్‌డ్ రిపేరర్లకు చెల్లించాల్సిన పనిలేదని వాదించారు. స్టాంపింగ్ చేసే ముందు జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి సమాచారం ఇచ్చి కాటాల సర్వీస్ ప్రొవైడర్‌కు సమన్వయం చేసుకుని టెక్నీషియన్‌తో కాటా రిపేర్లు ఉంటే చేయించాలని ఆ సమావేశంలో డీలర్లు కోరారు. కాటాలు ప్రామాణికంగా ఉన్నాయా లేదా అన్న కాలిబరేషన్ కోసం ప్రభుత్వానికి రూ.300 ఫీజు ఎప్పటిలాగే చెల్లిస్తామని చెప్పారు. దీంతో వివాదానికి తెరపడింది.
సమాచారం లేదు.. సర్వీస్ ప్రొవైడర్ టెక్నీషియన్ లేడు
ఎన్టీఆర్ జిల్లాలో కాటాలకు స్టాంపింగ్ చేసేటపుడు తూనికలు, కొలతలశాఖ అధికారులు జిల్లా పౌరసరఫరాల అఽఽధికారి కార్యాలయానికి సమాచారం ఇచ్చి కాటాల సర్వీస్ ప్రొవైడర్ టెక్నీషియన్‌ను సమన్వయం చేసుకుని కాటాలకు మరమ్మతులు ఉంటే చేయించి, అపుడు సీల్ చేయాలి. కానీ, ఇటీవల మైలవరం తదితర ప్రాంతాల్లో ఇటువంటిది ఏమీ లేకుండా సీల్ వేసే కార్యక్రమం చేస్తున్నారు. పైగా ప్రతి రేషన్ డీలర్ నుంచి రూ.1000 చొప్పున వసూలు చేసి ఒకటే బిల్లు ఇస్తున్నారు. వాస్తవానికి డీలర్లు ప్రభుత్వానికి చెల్లించే రూ.300 సీఎఫ్‌యంఎస్ ద్వారా చెల్లించి రసీదును సంబంధిత అధికారికి అందజేస్తేనే .. వారు వచ్చి సీల్ వేయాలి. కాని అందుకు విరుద్ధంగా మైలవరంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం జరిగిపోతోంది.