Share News

CCI Malividatha Tender: సీసీఐ మలివిడత టెండర్‌లోనూ వీడని ప్రతిష్ఠంభన

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:08 AM

సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి, జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు మధ్య ఏర్పడిన లడాయి కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీన సీసీఐ మలి విడత టెండర్‌ నోటిఫికేషన్‌..

CCI Malividatha Tender: సీసీఐ మలివిడత టెండర్‌లోనూ వీడని ప్రతిష్ఠంభన

బిడ్స్‌ వేసేందుకు ముందుకు రాని జిన్నర్లు

గుంటూరు సిటీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి, జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు మధ్య ఏర్పడిన లడాయి కొనసాగుతోంది. ఈ నెల 18వ తేదీన సీసీఐ మలి విడత టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలోని జిన్నర్లు బిడ్స్‌ వేేసందుకు ముందుకు రాలేదు. మలి విడత విడుదల చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌లో వెలువరించిన అనేక అంశాలను కూడా జిన్నర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోని జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేేసందుకు సీసీఐ ఆగస్టు 12వ తేదీన వెలువరించిన మొదటి విడత టెండర్‌ నోటిఫికేషన్‌ వివాదాస్పదమయింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలోని జిన్నింగ్‌ మిల్లుల యజమానులు టెండర్‌ నోటిఫికేషన్‌ను బహిష్కరించారు. నోటిఫికేషన్‌లో ఉన్న పలు నిబంధనలు సడలించాలని జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పట్టుబట్టారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర జౌళి శాఖ సంయుక్త కార్యదర్శి పద్మిని సింగ్లా ఈ నెల 11న సీసీఐ సీఎండీ, జిన్నర్లతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో జిన్నర్లు సీసీఐ చెబుతున్నట్లుగా దూది శాతం పెంపు, ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3, ఎల్‌ 4, ఎల్‌ 5 ప్రక్రియను అమలు వంటి పలు కీలక అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సమావేశంలో కొన్ని నిబంధనలు సడలించేందుకు సీసీఐ సీఎండీ సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. సీఎండీ చెప్పినట్టుగానే మలి విడత నోటిఫికేషన్‌ వచ్చినప్పటికీ నిబంధనలు పెద్దగా సడలించక పోవటం జిన్నర్లను నిరాశకు గురిచేసింది. మలివిడత నోటిఫికేషన్‌లో కూడా పెద్దగా ఊరట దక్కని విషయాన్ని జిన్నర్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అభ్యంతరాలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని కీలక సూచనలు చేస్తూ సీసీఐ మేనేజర్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. సీసీఐ మేనేజర్‌ నిర్ణయం మీదనే ఆధారపడి టెండర్‌ ప్రక్రియలో పాల్గొనాలని జిన్నర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా వెలువరించిన టెండర్‌ నోటిఫికేషన్‌కు కూడా ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలతో గడువు ముగియనుంది.

Updated Date - Sep 21 , 2025 | 05:08 AM