ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ భూముల మాయ!
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:26 AM
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల భూముల ఆక్రమణ, అమ్మకాలు, కొనుగోలు వంటి వ్యవహారాలు నేటికీ కొనసాగుతున్నట్లు సమాచారం. తాజాగా ఆక్రమణదారుల నుంచి నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం 1.25 ఎకరాల స్థలాన్ని రూ.3.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కళాశాల భూముల కోసం పూర్వ విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. ఆ భూములు మొదటి నుంచి మావేనని ఆక్రమణదారులు వాదిస్తున్నట్లు సమాచారం.

- ఆక్రమణ చెరలో 7.25 ఎకరాల భూమి
- అందులో 1.25 ఎకరాలను తాజాగా కొనుగోలు చేసిన ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం
- ఆక్రమణలోని భూమి విలువ నేడు రూ.700 కోట్లుపైనే
- కళాశాల భూమి కోసం పోరాడుతున్న పూర్వ విద్యార్థులు
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల భూముల ఆక్రమణ, అమ్మకాలు, కొనుగోలు వంటి వ్యవహారాలు నేటికీ కొనసాగుతున్నట్లు సమాచారం. తాజాగా ఆక్రమణదారుల నుంచి నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం 1.25 ఎకరాల స్థలాన్ని రూ.3.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కళాశాల భూముల కోసం పూర్వ విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. ఆ భూములు మొదటి నుంచి మావేనని ఆక్రమణదారులు వాదిస్తున్నట్లు సమాచారం.
(ఆంధ్రజ్యోతి, గుణదల):
బెజవాడ వాసుల చదువుల నిమిత్తం 1958లో నూజివీడు జమిందారులు మాచవరంలో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు 7.25 ఎకరాలు ఉచితంగా ఇచ్చారు. చుండూరు వెంకటరెడ్డి, రాజారంగయ్య అప్పారావు ఈ భూమిని ఏపీ ప్రభుత్వానికి బదలాయించినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 1958లో ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ రోజుల్లో ఖాళీగా ఉన్న భూమిలో గడ్డి సాగు నిమిత్తం లీజుకు తీసుకున్న వ్యక్తి 1968లో రఫ్ పట్టాను పుట్టించి ఆ భూమి తనదేనని వాదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇది తమకు ఇచ్చిన భూమి అంటూ కళాశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. 1982లో రఫ్ పట్టాను రద్దు చేయాలంటూ అప్పటి ఎమ్మార్వో ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ భూమికి హక్కుదారులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది అధికారుల సహాయ సహకారాలతో ఆ భూమిలో ప్లాట్లు వేసి అమ్మేసుకుంటున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన వారు ఇప్పటి వరకు సుమారు 26 ఇళ్లు ఆ భూమిలో నిర్మించినట్లు తెలిసింది.
భూమి కోసం పూర్వ విద్యార్థుల పోరాటం
ఆక్రమణకు గురైన భూమిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో కళాశాల పూర్వ విద్యార్థులు సుమారు రెండు వేల మంది సభ్యులతో 2017లో ఒక అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అప్పటి నుంచి వారు పార్టీలకతీతంగా పోరాటం చేస్తున్నారు. ఈ స్థలం కోర్టు పరిధిలో ఉంది అని తెలియజేస్తూ కళాశాల యాజమాన్యం, అసోసియేషన్ సభ్యులు ఆక్రమిత స్థలంలో పెట్టిన బోర్డులు తెల్లారేసరికి మాయమవుతున్నట్లు సమాచారం. తాజాగా 20 రోజుల క్రితం 1.25 ఎకరాల స్థలాన్ని నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం రూ.3.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 1977లో ఈ భూమి మొత్తం ప్రజల ఆస్తి అని తెలియజేస్తూ మాస్టర్ ప్లాన్‌లో నమోదై ఉన్నట్లు తెలిసింది. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ ఆ భూమి మాదే అని చెప్పుకుంటున్న వ్యక్తిని విచారణ చేసిన సమయంలో.. నిజమే ఆ స్థలం ప్రజల ఆస్తి అని మాస్టర్ ప్లాన్‌లో ఉంది అనే విషయాన్ని అంగీకరిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
కళాశాలలో చదువుకున్న ప్రముఖులు వీరే
ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు, తమిళనాడు మాజీ గవర్నర్ పి.ఎస్.రామ్మోహనరావు, నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్, విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) ఇలా ఎంతోమంది ఈ కళాశాలలో చదువుకున్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యన్నారాయణ అధ్యాపకుడిగా సేవలందించారు.