Share News

ప్రధాని రాకతో శ్రీశైలానికి మరింత వైభవం

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:41 PM

ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనతో శ్రీశైల వైభవం మరింత పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు పీవీఎన మాధవ్‌ అన్నారు.

   ప్రధాని రాకతో శ్రీశైలానికి మరింత వైభవం
శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న బీజేపీ నేత మాధవ్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఈఓ శ్రీనివాసరావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్‌

శ్రీశైలం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనతో శ్రీశైల వైభవం మరింత పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు పీవీఎన మాధవ్‌ అన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మాధత పాటు శ్రీశైలం ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన పోతుగుంట రమేష్‌ నాయుడు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్‌ రాజకుమారి, ఈఓ ఎం.శ్రీనివాసరావులు పరిశీలించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ప్రధాని ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఎంత సమయం ఉంటారు వంటి అంశాలపై అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్‌ మాట్లాడుతూ ప్రధాని మల్లికార్జున స్వామి వారి దర్శనార్ధం రావడం గొప్ప విశేషమన్నారు. తొలిసారిగా మోదీ ఇక్కడి జ్యోతిర్లింగం క్షేత్రానికి వస్తున్నారన్నారు. ఆయన రాకతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని వచ్చిన తర్వాత ఇక్కడి ప్రాంతం విశిష్టత, విశేషాలను ఆయనకు తెలియజేస్తామన్నారు. దీంతో శ్రీశైలం ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి ద్వారా కృషి చేయిస్తామన్నారు. శ్రీశైలం నుంచి శివాజీ మహారాజ్‌ ధ్యానం చేసి దేశవ్యాప్తంగా జైత్రయాత్ర సాగించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ2.0 ద్వారా సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచిందన్నారు. దేశంలోనే తొలిసారిగా సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈనెల 16వ తేదీన జరిగే ప్రధాని సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Oct 07 , 2025 | 11:43 PM