Dam Safety Inspection: శ్రీశైలం క్రస్ట్ గేట్లన్నీ ఐదేళ్లకైనా మార్చాల్సిందే
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:55 AM
శ్రీశైలం జలాశయంలో 10వ గేటు లీకేజీతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు చెప్పారు. అయితే ఐదేళ్లకైనా ఉన్న 12 క్రస్ట్ గేట్లన్నింటినీ మార్చాల్సిందేనని స్పష్టంచేశారు.
లేదంటే తుంగభద్ర పరిస్థితే: కన్నయ్యనాయుడు
10వ గేటు లీకేజీతో ప్రస్తుతానికి ముప్పులేదు
శ్రీశైలం డ్యాంను పరిశీలించిన గేట్ల నిపుణుడు
నేడు గోదారి పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి
పోలవరం నుంచి 2,23,309 క్యూసెక్కుల నీరు విడుదల
నంద్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో 10వ గేటు లీకేజీతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు చెప్పారు. అయితే ఐదేళ్లకైనా ఉన్న 12 క్రస్ట్ గేట్లన్నింటినీ మార్చాల్సిందేనని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన జలాశయాన్ని, గేట్లను ఆయన పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గేట్ల నుంచి ప్రస్తుతం 10శాతం కంటే తక్కువ లీకేజీ ఉందని తెలిపారు. క్రమం తప్పకుండా రేడియల్ క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ చేయాలని సూచించారు. ఐదేళ్లకైనా అన్ని గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని.. లేకపోతే తుంగభద్ర డ్యాం పరిస్థితే ఇక్కడా ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. ప్లంజ్ పూల్ వద్ద గొయ్యితో జలాశయానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రభుత్వం జలాశయానికి, క్రస్ట్‌గేట్ల నిర్వహణకు తగిన స్థాయిలు నిధులు కేటాయించాలని కోరారు. గేట్ల తీరుపై అధికారులతో కలిసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు.