Share News

Experts Reports: శ్రీశైలానికి డేంజర్‌ బెల్స్‌

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:09 AM

శ్రీశైలం జలాశయం ప్రమాదపుటంచుల్లో ఉందని.. ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీగొయ్యి విస్తరించడం..

Experts Reports: శ్రీశైలానికి డేంజర్‌ బెల్స్‌

  • డ్యాం పునాదుల కంటే లోతుకు చేరిన ప్లంజ్‌పూల్‌ గొయ్యి!

  • రక్షణగా పెట్టిన 62 సిలిండర్లు శిథిలం

  • కాంక్రీటు కొట్టుకుపోవడంతో.. నీటిలోపల బయటపడిన కొన్ని సిలిండర్లు

  • తక్షణం కొత్తవి అమర్చాలి.. లేదంటే ముప్పే!

  • సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌, సీలైన్‌ సంస్థల నివేదికలు

  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు

  • వీటికి రూ.160-180 కోట్ల వ్యయం!

  • అప్రోచ్‌ రోడ్డు, ఇతర మరమ్మతులకు 203 కోట్లిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం

  • ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు

  • కొండరాళ్లు జారకుండా షాట్‌ క్రీటింగ్‌కూ

తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టుకు ప్లంజ్‌పూల్‌ భారీ గొయ్యి నుంచి ప్రమాదం పొంచి ఉందా? డ్యాం భద్రతకు ఏర్పాటు చేసిన సిలిండర్లు దెబ్బతిన్నాయా..? వీటి తాజా పరిస్థితిపై అధ్యయనం చేసిన సంస్థలు ఇచ్చిన నివేదికలు ఈ ప్రశ్నలకు అవుననే జవాబిస్తున్నాయి. సిలిండర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తే ప్లంజ్‌పూల్‌ గుంతలు డ్యాం ఆనకట్ట వైపు విస్తరించే ప్రమాదం ఉంది.

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

శ్రీశైలం జలాశయం ప్రమాదపుటంచుల్లో ఉందని.. ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీగొయ్యి విస్తరించడం.. ఆనకట్ట రక్షణకు అమర్చిన 62 సిలిండర్లు దెబ్బతినడం ప్రమాద సంకేతాలని అధ్యయన సంస్థలు తమ నివేదికల్లో స్పష్టం చేశాయి. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కుల అతిభారీ వరద రావడంతో ప్రాజెక్టు దెబ్బతింది. 2014 సెప్టెంబరు 23న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ శ్రీశైలం డ్యాం సహా వివిధ ప్రధాన ప్రాజెక్టుల భద్రతా, నిర్వహణ లోపాలపై సమీక్షించింది. ఆ తర్వాత పదేళ్లలో కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వైకే మూర్తి, సీడబ్ల్యూసీ మరో మాజీ చైర్మన్‌, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్యా, నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ మాజీ, ప్రస్తుత చైర్మన్లు వివేక్‌ త్రిపాఠి, అనిల్‌ జైన్‌ సహా అనేకమంది నిపుణులు, ప్యానెళ్లు, కమిటీలు ప్రాజెక్టును సందర్శించాయి. పలు లోపాలు ఎత్తు చూపుతూ డ్యాం భద్రతకు తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశాయి. డ్యాం దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్‌ భారీ గొయ్యి సహా నదీగర్భం, రాతికట్ట కోతకు గురవుతున్నాయని.. డ్యాం భద్రత దృష్ట్యా నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించాయి. అయినా పాలకులు నిర్లక్ష్యం వీడలేదు. గతవైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యం.. డ్యాం పాలిట శాపంగా మారింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం సహా పలు మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించింది. అయితే కొత్త సిలిండర్ల ఏర్పాటు ఈ పనుల్లో లేదు. ప్రస్తుతం వీటి కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ఎంతలేదన్నా.. సిలిండర్లకు రూ.160 నుంచి 180 కోట్ల వరకు ఖర్చవుతుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు అంటున్నారు.


పలు సంస్థల అధ్యయనాలు..: వాస్తవానికి 2009లో వచ్చిన భారీ వరదల కారణంగానే ప్లంజ్‌పూల్‌ గొయ్యి బాగా పెద్దదైంది. సిలిండర్లు దెబ్బతినడమే కాదు.. అప్రోచ్‌ రోడ్డు ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు సీఎం అయ్యాక ప్లంజ్‌పూల్‌ గొయ్యిపై 2018లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐవో) సంస్థ అధ్యయనం చేసింది. గొయ్యి 42 మీటర్లు లోతు లో ఉందని నివేదిక ఇచ్చింది. 2020 ఫిబ్రవరి 25న ఏబీ పాండ్యా సారథ్యంలో నియమించిన కమిటీ 2021లో నివేదిక ఇచ్చింది. అనంతరం నాటి ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ వివేక్‌ త్రిపాఠి ఆధ్వర్యంలోని నిపుణుల బృందం కూడా రిపోర్టు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌డీఏ్‌సఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌ శ్రీశైలం డ్యాంను సందర్శించారు. డ్యాం రక్షణ కోసం ఏర్పాటు చేసిన 67 సిలిండర్లలో 62 పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్లంజ్‌పూల్‌ ప్రమాదకరంగా మారిందని నిపుణులు ఇచ్చిన నివేదికలు చెబుతున్నాయని.. 2009 వరదలకు దెబ్బతిన్న డ్యాం మరమ్మతులు చేపట్టకపోవడం, నిపుణుల సూచనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దాంతో ప్లంజ్‌పూల్‌ గుంత వల్ల డ్యాం ఆనకట్ట, పునాదులకు ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో.. అధ్యయనం చేసేందుకు పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు అప్పగించారు. అలాగే.. డ్యాంకు రక్షణగా ఏర్పాటుచేసిన సిలిండర్ల తాజా పరిస్థితిని తెలుసుకునే బాధ్యతను విశాఖకు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపట్టింది. ఈ సంస్థలు లోతుగా అధ్యయనం చేసి వేర్వేరుగా నివేదికలిచ్చాయి.


పునాదుల కంటే లోతులో..

ప్లంజ్‌పూల్‌ గొయ్యి 42 మీటర్లు లోతులో ఉందని ఎన్‌ఐవో గతంలోనే తెలుపగా.. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ కూడా దాదాపు ఇదే చెప్పింది. ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ బాతిమెట్రి సిస్టమ్‌(ఐబీఎస్‌), సింగల్‌ బీమ్‌ డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ ఎకోసౌండర్‌, మోటరైజ్డ్‌ సర్వే బోట్‌లో అమర్చే డీజీపీఎస్‌, నావిగేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సర్వే చేపట్టింది. ప్లంజ్‌పూల్‌ గొయ్యి 43-45మీ. లోతులో, 400మీ. పొడవు, 270మీ. వెడల్పున ఉందని.. 2018 నాటి గోతితో పోలిస్తే పెద్దగా తేడా లేదని తేలినట్లు వెల్లడించింది. అయితే డ్యాం ఆనకట్ట పునాదులు కుడి, ఎడమ కొండల పక్కన 15-18 మీటర్ల లోతున, మధ్యలో 30-40 మీ. లోతున ఉన్నాయని రిటైర్డ్‌ ఎస్‌ఈ ఒకరు వెల్లడించారు. పునాదుల లోతు కంటే ప్లంజ్‌పూల్‌ గొయ్యి ఎక్కువ లోతులో ఉండడం డ్యాంకు ప్రమాదమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గొయ్యి అప్రాన్‌ నుంచి 15 మీ తర్వాత మొదలవుతుంది.


డ్యాం రక్షణకు అత్యంత కీలకం సిలిండర్లు

శ్రీశైలం డ్యాం భద్రతలో అత్యంత కీలకమైనవి సిలిండర్లు. డ్యాం నిర్మాణ సమయంలో ఆనకట్ట ముందు భాగంలోని రాళ్లు కొట్టుకుపోయాయి. దీంతో డ్యాం రక్షణకు 1978-79లో ఆనకట్ట నుంచి 13-15 మీటర్లు పొడవు, 3-4 మీటర్ల మందంతో సీసీ కాంక్రీట్‌తో అప్రాన్‌ నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన వరదలకు అప్రాన్‌కు కూడా కాంక్రీట్‌ పెచ్చులు ఊడిపోతుండంతో శాశ్వత రక్షణలో భాగంగా 1986-89 మధ్య దాదాపు 67 సిలిండర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో సిలిండర్‌ను రెండు మీటర్ల వ్యాసంలో, 18-20 మీటర్లు లోతులో ఏర్పాటు చేశారు. 20 మీటర్ల లోతులో ఒక మీటరు కాంక్రీట్‌ వేసి ఆ కాంక్రీట్‌పైన డ్యాం కుడి, ఎడమ రెండు కొండల మధ్య వీటిని అమర్చారు. వాటిని కాంక్రీట్‌తో నింపినట్లు రిటైర్డ్‌ ఇంజనీర్లు తెలిపారు. ప్లంజ్‌పూల్‌ భారీ గొయ్యి ఆనకట్ట వైపు విస్తరించకుండా ఈ సిలిండర్లు రక్షణగా ఉంటున్నాయి. అయితే 2009లో సంభవించిన భారీ వరదలకు సిలిండర్లు భారీగా దెబ్బతిన్నాయి. ఏ మేరకు దెబ్బతిన్నాయో గుర్తించే బాధ్యతను విశాఖకు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. దీని అధ్యయనంలో విస్తుగొలిపే నిజాలు వెలుగు చూశాయి. వరదలకు కాంక్రీటు మొత్తం కొట్టుకుపోయి.. 62 సిలిండర్లు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్నాయని.. వీటిలో కొన్ని ఎలాంటి ఆధారం లేకుండా లోపల నీటిలోనే తేలుతున్నట్లు గుర్తించారు. సిలిండర్లు పాడైపోవడంపై నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


తెలుగు రాష్ట్రాల జీవనాడి

కృష్ణానదిపై నిర్మించిన మొట్టమొదటి జలవిద్యుత్‌ ప్రాజెక్టు శ్రీశైలం. తర్వాత దానిని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చారు. ఎన్నో ఏళ్లుగా ఇది తెలుగు రాష్ట్రాలకు ప్రాణాధారమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1963 జూలై 24న అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు. 20ఏళ్లకు నిర్మాణం పూర్తయింది. 1984లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 143.26 మీ. ఎత్తు, 512మీ. పొడవున్న గ్రావిటీ ఆనకట్ట ఇది. 308.04 టీఎంసీ ల సామర్థ్యంతో నిర్మాణం చేసినా.. తర్వాత పూడిక చేరడంతో నిల్వసామర్థ్యాన్ని 215.807 టీఎంసీలకు కుదించారు. ఆనకట్ట స్పిల్‌వే పొడవు 266.4 మీటర్లు. స్పిల్‌వేకు ఇరువైపులా నాన్‌-ఓవర్‌ఫ్లో విభాగాలు ఉన్నాయి.

Updated Date - Dec 08 , 2025 | 04:11 AM