Share News

Srisailam Dam: 20 సిలెండర్లు దెబ్బతిన్నాయ్‌

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:40 AM

వర్షాలు జోరందుకుని.. వరదలు వచ్చేలోగా శ్రీశైలం జలాశయం కట్టడాలకు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర జల-విద్యుత్‌ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిరంతరాయంగా శ్రమిస్తోంది.

Srisailam Dam: 20 సిలెండర్లు దెబ్బతిన్నాయ్‌

  • శ్రీశైలం జలాశయ భూగర్భ వీడియోగ్రఫీలో నిర్ధారణ

  • డ్యామేజీపై కొనసాగుతున్న అధ్యయనం

  • మిగతా 31 సిలెండర్ల స్థితిగతులూ తెలుసుకోవాలని నిర్ణయం

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వర్షాలు జోరందుకుని.. వరదలు వచ్చేలోగా శ్రీశైలం జలాశయం కట్టడాలకు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర జల-విద్యుత్‌ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిరంతరాయంగా శ్రమిస్తోంది. అదేవిధంగా విశాఖకు చెందిన ప్రైవేటు ఓషనోగ్రఫీ పరిశోధన సంస్థ.. జలాశయం భూగర్భంలో అమర్చిన 62 సిలెండర్లలో 31 సిలెండర్ల స్థితిగతులను వీడియో తీస్తోంది. ఇందులో 12 సిలెండర్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మిగిలిన 31 సిలెండర్లలో ఎన్ని దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు వాటిని కూడా వీడియోగ్రఫీ తీయాలని నిర్ణయించారు. దీంతో మరికొన్ని రోజులు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు. పూర్తిగా బెబ్బతిన్న సిలెండర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చుతామని.. పాక్షికంగా దెబ్బతిన్నవాటికి అండర్‌గ్రౌండ్‌లోనే కొత్త సాంకేతిక విధానాల ద్వారా వెల్డింగ్‌ చేస్తామని శ్రీశైలం ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం సానుకూలంగానే ఉందని.. అండర్‌ గ్రౌండ్‌ వీడియోగ్రఫీకి ఎలాంటి అవరోధాలూ ఎదురుకాలేదని శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇంకోవైపు.. ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి విషయంలోనూ సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు విస్తృతంగాద అధ్యయనం చేస్తున్నారు. దశాబ్దాల నుంచీ ఈ గొయ్యి 47 మీటర్ల లోతున ఉందని.. అది పెరగలేదని ఇటీవల గుర్తించారు. అయినప్పటికీ.. పాథ్‌మేటిక్స్‌ అధ్యయనం ద్వారా గొయ్యి స్థిరంగా ఉందో.. ఇంకా పెద్దదైందో తెలుసుకుంటారని శ్రీశైలం అధికారులు చెప్పారు. అప్రోచ్‌ రోడ్డు, యాప్రాన్‌కు బోర్‌వెల్స్‌ వేయడం ద్వారా డ్యాం భద్రతపైనా శాస్త్రీయ అధ్యయనం జరుగుతుందన్నారు. ఇప్పటికే డ్యాం డ్యామేజీపై 50 శాతం అధ్యయనం పూర్తయిందని తెలిపారు. వర్షాలు ఉధృతమయ్యేలోగా మిగిలిన నష్టం కూడా అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

Updated Date - Jun 14 , 2025 | 04:43 AM