Share News

Demise Case: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి అరెస్టు

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:55 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు (25) హత్యకు గురయ్యాడు.

Demise Case: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి అరెస్టు

  • మాజీ పీఏ హత్య కేసులో వినుతతో పాటు ఆమె భర్త, మరో ముగ్గురు కూడా..

  • అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు

  • రేణిగుంటలో చంపి.. శవాన్ని చెన్నైలోని ఓ కాలువలో పడేసిన నిందితులు

  • హత్యకు కారణాలపై పలు అనుమానాలు.. వినుతపై జనసేన బహిష్కరణ వేటు

చెన్నై/తిరుపతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు (25) హత్యకు గురయ్యాడు. రేణిగుంటలో చంపేసి.. శవాన్ని తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని బేసిన్‌బ్రిడ్జ్‌ సమీప కూవం కాలువలో పడేశారు. హత్య ఈనెల 7న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించి వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌ (చంద్రబాబు), వారి ఇద్దరు డ్రైవర్లు గోపి, షేక్‌ తసన్‌, అనుచరుడు శివకుమార్‌లను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేణిగుంటలో శుక్రవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులును నిందితులు రేణిగుంటలోని ఒక గోడౌన్‌లో చిత్రహింసలకు గురిచేసి.. అతని మెడకు తాడు, ఇనుప చైన్‌ బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.


హత్యకు దారితీసిన కారణాలేంటి?

శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు చెందిన శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు 2019 నుంచి వినుత దంపతుల వద్ద కారు డ్రైవర్‌గా, పీఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల పలు విషయాలపై వినుత దంపతులు, శ్రీనివాసులుకు మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. వినుతకు అన్నీ తానై వ్యవహరించిన శ్రీనివాసులు.. ఆమె వ్యక్తిగత వ్యవహారాల వీడియోలు తీశాడు. డబ్బు డిమాండ్‌ చేయడంతో గత నెల అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఫోన్‌లోని వీడియోలు, ఫోటోలను తొలగించి, పంపించేశారు. ఈ వీడియోలతో పాటు ఇతర రహస్య సమాచారాన్ని నియోజకవర్గ కీలక నేతకు చేరవేశాడని వినుత దంపతులు అనుమానించారు. ఆ తర్వాత తన వద్ద పీఏగా పనిచేస్తున్న శ్రీనివాసులును తొలగిస్తున్నట్టు వినుత గత నెల 22న సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో పోస్టు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయి ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించిన కారణంగా తొలగించినట్టు పేర్కొన్నారు. కాగా, హత్య కేసులో వినుత అరెస్టు కావడంతో ఆమెపై జనసేన పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది.

Updated Date - Jul 13 , 2025 | 02:59 AM