Share News

SriKakulam: కుట్లు విప్పిన తెల్లారే పేగులు బయటకు..!

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:57 AM

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. పది రోజులు ఆస్పత్రిలోనే ఉంచాక, కుట్లు విప్పి ఇంటింకి పంపించారు.

SriKakulam: కుట్లు విప్పిన తెల్లారే పేగులు బయటకు..!

మళ్లీ శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన

నరసన్నపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. పది రోజులు ఆస్పత్రిలోనే ఉంచాక, కుట్లు విప్పి ఇంటింకి పంపించారు. ఆ మరుసటి రోజే శస్త్రచికిత్స చేసిన భాగం నుంచి పేగులు బయటకు రావడంతో మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. నరసన్నపేట మండలం కోమర్తి గ్రామానికి చెందిన మెండ పాపారావు కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 23న నరసన్నపేటలోని గొలివి ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం పేగులకు చీము పట్టి రంధ్రాలు ఏర్పాడ్డాయని గుర్తించిన వైద్యులు పాపారావుకు శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 9న వైద్యులు కుట్లు విప్పి.. నడుముకు బెల్టు వేసి ఇంటికి పంపించేశారు. అయితే సోమవారం రాత్రి శస్త్ర చికిత్స చేసిన భాగం నుంచి పేగులు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు మంగళవారం అదే ఆస్పత్రిలో చేర్పించారు. కుట్లు కలవలేదని గుర్తించిన డాక్టర్‌ గొలివి మోహనరావు... మళ్లీ ఆపరేషన్‌ చేసి వాటిని సరిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మోహనరావు మాట్లాడుతూ.. పాపారావు ఆరోగ్యం నిలకడగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం కొందరికి కుట్లు కలిసేందుకు నెల రోజులు పడుతుందని చెప్పారు. ముందస్తుగా బెల్టు వేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:57 AM