Share News

Tirumala Temple: బ్రహ్మోత్సవ సంరంభం

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:28 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ధ్వజారోహణం కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. సాయంత్రం 5.43- 6.15 గంటల మధ్య మీన లగ్నంలో అర్చకబృందం బంగారు ధ్వజస్తంభంపై...

Tirumala Temple: బ్రహ్మోత్సవ సంరంభం

  • ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  • స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

  • రాత్రి పెద్దశేష వాహనంపై విహరించిన మలయప్ప

  • వాహన సేవలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

  • ఎవరికీ ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారు

  • 14సార్లు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కింది: సీఎం

తిరుమల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ధ్వజారోహణం కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. సాయంత్రం 5.43- 6.15 గంటల మధ్య మీన లగ్నంలో అర్చకబృందం బంగారు ధ్వజస్తంభంపై గరుడపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫుున సీఎం చంద్రబాబు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్‌ దంపతులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి విశ్రాంతి భవనానికి చంద్రబాబు చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో బేడిఅంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయన తలకు. అర్చకులు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న చంద్రబాబు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని వస్త్రసమర్పణ చేశారు. మూలవర్లను దర్శించుకుని బలిపీఠం, ధ్వజస్తంభానికి మొక్కుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేదపండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపం చేరుకుని పెద్దశేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కూడా శ్రీవారిని దర్శించుకుని చంద్రబాబుతో కలిసి వాహనసేవలో పాల్గొన్నారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులు, సినీ సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మొదలైన వాహన సేవలు

బ్రహ్మోత్సవాల తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు గ్యాలరీల్లో వేచివుండి, స్వామికి కర్పూరనీరాజనాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవ వాహన సేవల వైభవం ప్రారంభమైంది.

Untitled-3 copy.jpg


ఎవరికీ ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారు

14సార్లు పట్టువస్ర్తాలు సమర్పించే భాగ్యం దక్కింది: సీఎం

‘ఎవరికీ ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారు. 14సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్ర్తాలు సమర్పించే భాగ్యం లభించింది’ అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారికి పట్టువస్ర్తాల సమర్పణ అనంతరం ఆయన ఆలయంలోని రంగనాయక మండపంలో మాట్లాడారు. తనకు ఏ కష్టం వచ్చిన స్వామిపైనే భారం వేసి ముందుకు వెళతానని చెప్పారు. 22 ఏళ్ల ముందు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారే తనకు ప్రాణభిక్ష పెట్టాడని, మామూలుగా అయితే అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేదన్నారు. టీటీడీ, శ్రీవారి పవిత్రతను కాపాడుకుంటూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ‘ఎన్టీ రామారావు మొదటిసారి సీఎం అయినప్పుడు అన్నదానం ప్రారంభించారు. ఇప్పుడు ఆ ట్రస్టులో రూ.2,283 కోట్ల కార్పస్‌ నిధులున్నాయి. ప్రతినెలా రూ.12 కోట్లు అన్నప్రసాద వితరణకు ఖర్చువుతోంది. రూ.14 కోట్ల ఆదాయం వస్తోంది. వడ్డీతోనే అన్నదానం కార్యక్రమాన్ని పూర్తిచేసే పరిస్థితులు వస్తాయి. ఇదే తరహాలో టీటీడీ ఆఽధ్వర్యంలోని ఆలయాలన్నిటిలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని టీటీడీ బోర్డు, అధికారులకు సూచిస్తున్నా. శ్రీవారు నాకు ప్రాణభిక్ష పెట్టినప్పుడే ప్రాణదానం ట్రస్టును ప్రారంభించాం. ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ.709 కోట్లు రాగా, రూ.21 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.688 కోట్ల నిధులున్నాయి. ‘హిందువులు ఎక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయం ఉండాలి. ఆ ఆలయాలన్నీ తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి అనుసంధానం చేసుకుందాం. శ్రీవాణి ట్రస్టుల్లో ఇప్పటికే రూ.2,038 కోట్లు ఉంది. ఇప్పటికే రూ.837 కోట్లు ఖర్చు పెట్టాం.


రూ.200 కోట్లకుపైగా వడ్డీ రూపంలో వచ్చింది. ఇంకా, రూ.1,700 కోట్లు ట్రస్టులో ఉంది. 5వేల ఆలయాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించి పేదప్రజలకు శ్రీవారిని కొలిచే భాగ్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని టీటీడీ బోర్డు, అధికారులను కోరుతున్నా. ఇతర రాష్ట్ర రాజధానుల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించేలా నేనే స్వయంగా లేఖలు రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఈ సంకల్పాన్ని ఇక్కడ నుంచే చేస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలి. స్వామివారికి శ్రీవారి సేవకులు అతిపెద్ద సంపద. ప్రపంచం మొత్తం ఓ నెట్‌వర్క్‌లా చేసి వారి సేవలను ఉపయోగించుకుంటూ, గుర్తింపు ఇచ్చే రేటింగ్‌ ఇవ్వాల్సిన అవసరముంది’. అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:31 AM