Sri Sathya Sai Trust: సాయి సేవా సముద్రం!
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:22 AM
‘అందరినీ ప్రేమించు! అందరినీ సేవించు’... ఇదే పుట్టపర్తి శ్రీసత్యసాయి సూత్రం! కులం, మతం, ప్రాంతం, విశ్వాసాలతో సంబంధంలేకుండా... అవసరార్థులందరినీ ఆదరించే తత్వం!
‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ నినాదం
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విశేష కార్యక్రమాలు
తల్లి సూచనలతో సత్యసాయి సేవా మార్గం
ఉచిత విద్య, వైద్యం, తాగునీటి పథకాలు
ప్రభుత్వంతో సమానంగా అనేక ప్రాజెక్టులు
140 దేశాల్లో ‘సేవాదళ్’ కార్యక్రమాలు
సాయి శివైక్యం తర్వాతా నిరాటంకంగా సేవలు
రేపు సత్యసాయిబాబా శతజయంతి
(పుట్టపర్తి - ఆంధ్రజ్యోతి)
‘అందరినీ ప్రేమించు! అందరినీ సేవించు’... ఇదే పుట్టపర్తి శ్రీసత్యసాయి సూత్రం! కులం, మతం, ప్రాంతం, విశ్వాసాలతో సంబంధంలేకుండా... అవసరార్థులందరినీ ఆదరించే తత్వం! విద్య, వైద్యం, తాగునీరు, ప్రజా సంక్షేమం, జంతు సంక్షేమం... ఇలా అనేక రంగాల్లో ఒక ప్రభుత్వంతో సమానంగా సేవలు అందించిన అనితర సాధ్యం! దీనంతటికీ మూలం... ‘సత్యసాయి సెంట్రల్ ట్రస్టు’! సేవే పరమావధిగా 1972లో సత్యసాయి దీనిని స్థాపించారు.
అమ్మ మాట.. సేవలకు బాట
సత్యసాయి సేవల వెనుక ఆయన తల్లి ఈశ్వరమ్మ కోరిక, సూచనలు ఉన్నాయి. 1950 దశకంలో పుట్టపర్తి కుగ్రామం. ఆరోగ్యం, విద్య, తాగునీరు వంటి మౌలిక వసతులేవీ లేవు. ప్రజల కష్టాన్ని చూసి సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ చలించిపోయారు. గ్రామప్రజలకు వైద్యం, విద్య, నీటి సదుపాయాలు కల్పించాలని కుమారుడు సత్యసాయి బాబాకు సూచించారు. అమ్మ అడిగిన వెంటనే 1956లో సత్యసాయి పుట్టపర్తిలో చిన్న ఆస్పత్రిని ప్రారంభించారు. అది అంచెలంచెలుగా జనరల్ ఆస్పత్రి స్థాయికి చేరింది. 1991 నవంబరు 22న పుట్టపర్తి సమీపంలో శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో 2001లో 333 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఇవి కాకుండా పల్లె జనం ముంగిటే వైద్య సేవలు అందించేందుకు 2006 మార్చి 30న మొబైల్ ఆస్పత్రులను ప్రారంభించారు. వీటి ద్వారా పుట్టపర్తి సహా చుట్టుపక్కల ఏడు మండలాల ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి.
సరస్వతీ సేవలో...
1950లో పుట్టపర్తిలో సత్యసాయి చిన్న పాఠశాలను ప్రారంభించారు. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ... 1981 నాటికి శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల, హయ్యర్ లెర్నింగ్ కాలేజీ, బెంగళూరులో బృందావనం కాలేజీ, అనంతపురంలో మహిళా క్యాంపస్, కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద ముద్దనహళ్లిలో మరో కళాశాల... ఇలా సత్యసాయి సెంట్రల్ ట్రస్టుద్వారా అనేక విద్యా సంస్థలు నడుస్తున్నాయి. గత 45 ఏళ్లుగా సత్యసాయి యూనివర్సిటీ ద్వారా వేలాది మందిడిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సేవాదళ్..
‘మానవ సేవే మాధవ సేవ’... అంటూ సత్యసాయి తన భక్తులను సైతం సేవా మార్గంలో నడిపించారు! దీనికోసం 1960 మార్చి 29న ప్రత్యేకంగా ‘సేవాదళ్’ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. విద్య, వైద్యం, పారిశుధ్య సేవలతోపాటు... వరదలు, సునామీ, భూకంపాల వంటి విపత్తులు వచ్చినప్పుడు సేవాదళ్ కార్యకర్తలు రంగంలోకి దిగి బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ‘నారాయణసేవ’ పేరిట అన్నదానం, నిరాశ్రయులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.
విలువలతో కూడిన సృజనాత్మక విద్య
దేశంలోని ప్రతి విద్యార్థికి విలువలు, సాంకేతికతో కూడిన విద్య అందాలనేది సత్యసాయి ఆకాంక్ష. దీనికోసమే తన 85వ పుట్టిన రోజున ‘సత్యసాయి విద్యా వాహిని’ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీనికి తమ టీసీఎస్ సంస్థ నిరంతరం సహకరిస్తుందని రతన్ టాటా అదే రోజున సత్యసాయి సమక్షంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా వలంటీర్లతో నిర్వహిస్తారు. క్లాస్‌రూం, కారిడార్, క్యాంపస్, కమ్యూనిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇందులో సమానత్వాన్ని పెంపొందించే ప్రేరణాత్మక కంటెంట్ తయారు చేసి... డిజిటల్, మల్టీ మీడియా ద్వారా విద్యార్థులకు ఆసక్తికరమైన విధానంలో అందిస్తారు. విద్యా వాహిని ద్వారా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందుతున్నారు. మూడు వేల మాస్టర్ లెసన్ ప్లాన్‌లు, 33 వేల డిజిటల్ అసెట్లు, 5 లక్షలకు పైగా దీక్షా లెర్నింగ్ లెసన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
‘సూపర్’ స్పెషాలిటీ...
సత్యసాయి ఆధ్వర్యంలో దక్షిణాసియాలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో నిర్మితమైంది. ఇక్కడ అన్ని రకాల వైద్య చికిత్సలూ ఉచితం! ఇందులో నవజాత శిశువుల (నియో నాటల్)తో మొదలుకుని... దంతాలు, నేత్రాలు, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గుండె, యూరాలజీ, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ తదితర అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఇందులో ఉన్నాయి. వివిధ విభాగాల్లో రోబోటిక్ సర్జరీలు కూడా జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 110 ఎకరాల్లో రూ.300 కోట్లతో నిర్మించారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వైద్యసేవలకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా... వారి మాతృభాషల్లోనే వివరాలు అందించే అనువాదకులూ ఇక్కడ ఉంటారు. జాతీయస్థాయి వైద్య సదస్సులకు కూడా ప్రశాంతి నిలయం ఎన్నో సార్లు వేదికగా మారింది.
దాహార్తి తీర్చిన సత్యసాయి
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు ఎడారి ఛాయలకు దగ్గరైన రోజులవి. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీన్ని గుర్తించిన సత్యసాయి... నాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా 1995 నవంబరు 23న రూ.380 కోట్లతో వాటర్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 750 గ్రామాలకు దాదాపు 2వేల కిలోమీటర్ల పైపులైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఈ పథకం అమలవుతోంది. ‘సత్యసాయి గంగ’ పేరుతో చెన్నై ప్రజలకు తాగునీరు అందుతోంది. సత్యసాయి తాగునీటి పథకంలో 558 మంది పని చేస్తున్నారు.
నిరంతర సేవా ప్రవాహం...
పుట్టపర్తి సత్యసాయి బాబా 2011 ఏప్రిల్ 24న శివైక్యం అయ్యారు. ఇప్పటికి 15 ఏళ్లు గడిచినా ఆయన ప్రారంభించిన సేవలకు ఎక్కడా అంతరాయం ఏర్పడలేదు. పైగా మరింత విస్తరిస్తున్నాయి. విద్య, వైద్య సేవలను ఆధునికీకరించారు. అధునాతన సాంకేతికతను ప్రవేశపెట్టారు. వైద్య సేవల్లో ఆఽధునిక పరికరాలు, రోబోటిక్ యంత్రాలను వినియోగంలోకి తెచ్చారు. వైద్య సిబ్బందిని పెంచుకుంటూ పోతున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో సేవలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. సాయి పిలుపు మేరకు ఆయన భక్తులు అందించిన, ఇప్పటికీ అందిస్తున్న విరాళాలు... నిపుణుల స్వచ్చంద సేవలే దీనికి ఆధారం!
140: ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో 7.5 లక్షల మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు.
102: దేశవిదేశాల్లో 102 విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటీ, జనరల్, మొబైల్ ఆసుపత్రుల్లో ఉచిత విద్య, వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
30 లక్షలు: ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 1600 గ్రామాల పరిధిలో 30 లక్షల మందికి సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
కోటి: సాధారణ వైద్యం నుంచి శస్త్రచికిత్సల దాకా ఇప్పటిదాకా కోటి మంది సత్యసాయి ఆస్పత్రుల్లో సేవలు అందుకున్నారు.