Share News

Sri Sailam Development: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:39 AM

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలోని...

Sri Sailam Development: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి

  • పుణ్యక్షేత్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

  • ఏటా లక్షల మంది భక్తులు వస్తున్నారు

  • తదనుగుణంగా వసతులు పెంచాలి

  • ప్రధాన రహదారులతో అనుసంధానం

  • 2 వేల హెక్టార్ల అటవీ భూమి కేటాయించాలని కేంద్రాన్ని అడుగుదాం

  • ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలి: సీఎం

  • 16న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సూచనలు

  • వర్చువల్‌గా పాల్గొన్న డిప్యూటీ సీఎం

  • శబరిమల, ఇతర ఆలయాలను పరిశీలించి అభివృద్ధి చేద్దామని పవన్‌ సూచన

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం అభివృద్ధిపై సమీక్షించారు. దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఏటా లక్షల సంఖ్యలో శ్రీశైలం ఆలయానికి భక్తులు వస్తున్నందున మెరుగైన సదుపాయాలు ఎలా కల్పించాలి, మాస్టర్‌ప్లాన్‌, అటవీ శాఖ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆలయ అభివృద్ధికి 2 వేల హెక్టార్ల అటవీభూమి కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణహితంగా అన్ని రకాలుగా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. అందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రధానంగా శ్రీశైలానికి జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. భక్తులు పెరుగుతున్నందున ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ర్టాల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున సౌకర్యాలు విస్తరించాలన్నారు. శబరిమల, ఇతర ప్రముఖ దేవాలయాల్లో సౌకర్యాలు పరిశీలించి అభివృద్ధి చేద్దామని సూచించారు. శ్రీశైలాన్ని ఆదర్శప్రాయ యాత్రాస్థలంగా తీర్చిదిద్దేందుకు దేవదాయ, అటవీ, పర్యాటక శాఖల నడుమ సమన్వయం అవసరమన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపైనా అధికారులకు తగు సూచనలు చేశారు. ఆలయంలో మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు వెళ్లేందుకు, బయటకు రావడానికి ఇప్పుడు ఒకే మార్గం ఉంది. బయటకు వచ్చేందుకు వేరే మార్గం ఏర్పాటుపైనా సమీక్షలో చర్చించారు.

Updated Date - Oct 06 , 2025 | 03:39 AM