Tirupati Airport: ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా!
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:41 AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులు ఆయా ప్రాంత సంప్రదాయ కట్టుబాట్లు, కళలు, ప్రాచీన విశేషాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంటాయి.
మారనున్న తిరుపతి విమానాశ్రయం, అలిపిరి ఆర్చి రూపురేఖలఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయికి డిజైన్ రూపకల్పన బాధ్యతలు...
తిరుమల, జూన్ 20(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎయిర్‌పోర్టుతో పాటు అలిపిరిలోని ఆర్చ్ కొత్త రూపాన్ని దిద్దుకోనున్నాయి. తిరుమల ఐకానిక్‌గా ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో వాటి డిజైన్లలో ఆర్ట్ డైరెక్టర్, టెంపుల్ ఆర్కిటెక్ట్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి బాధ్యత తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులు ఆయా ప్రాంత సంప్రదాయ కట్టుబాట్లు, కళలు, ప్రాచీన విశేషాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంటాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి విమానాశ్రయంలో ఆస్థాయి కళ లేదని ప్రస్తుత టీటీడీ బోర్డు, అఽధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలి ప్రాధాన్యతగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు ‘శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’గా పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ప్రతిపాదన మేరకు ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వైభవంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇక, అలిపిరి గరుడ సర్కిల్‌లోని ఆర్చిని కూడా ఆధునికీకరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, శంషాబాద్ సమీపంలోని రామానుజాచార్యుల ఆశ్రమ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆనంద్‌సాయికే ఈ బాధ్యత అప్పగించారు.