శాశ్వత లోక్ అదాలతతో సత్వర న్యాయం
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:06 PM
ప్రజా ప్రయోజనాల సేవల ద్వారా నష్టపోయిన బాధితులకు శాశ్వత లోక్ అదాలతలో సత్వర న్యాయం అందజేస్తున్నట్లు శాశ్వత లోక్ అదాలత చైర్మన ఎం. వెంకట హరినాథ్ తెలిపారు. బుధవారం పరిష్కారమైన ఓ కేసులో ఆయన ఆదేశాలు జారీ చేశారు.
శాశ్వత లోక్ అదాలత చైర్మన ఎం. వెంకట హరినాథ్
కర్నూలు లీగల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనాల సేవల ద్వారా నష్టపోయిన బాధితులకు శాశ్వత లోక్ అదాలతలో సత్వర న్యాయం అందజేస్తున్నట్లు శాశ్వత లోక్ అదాలత చైర్మన ఎం. వెంకట హరినాథ్ తెలిపారు. బుధవారం పరిష్కారమైన ఓ కేసులో ఆయన ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెందిన ఫిర్యాది ఏ. మదన మోహన కనకదుర్గ ఫైనాన్స కంపెనీ నుంచి ఓ వెహికల్‌ను తీసుకున్నారు. బాధితుడు వరుసగా అన్నీ ఈఎంఐలు చెల్లించినప్పటికీ ఆర్థిక సమస్యలతో రెండు ఈఎంఐలను చెల్లించలేదు. ఆ తర్వాత ఫైనాన్స కంపెనీతో ఒప్పందం చేసుకుని రూ.25వేలను చెల్లించడానికి అంగీకరించి రూ.20వేలను చెల్లించాడు. మిగతా రూ.5వేలు చెల్లించకపోవడంతో ఫైనాన్స కంపెనీ వారు బాధితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితుడు శాశ్వత లోక్ అదాలతను ఆశ్రయించడంతో బాధితుడికి కలిగిన నష్టాన్ని రూ.69వేలతో పాటు మానసిక వేదన కలిగించినందుకు మరో రూ.20వేలను చెల్లించాలని లోక్ అదాలత ఫైనాన్స కంపెనీని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో సభ్యులు శివశంకర్ రెడ్డి, రాజుబాబు, శాశ్వత లోక్ అదాలత సభ్యులు పాల్గొన్నారు.