భూ సంబంధిత ప్రక్రియలు వేగవంతం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:00 AM
జిల్లాలో భూ రీ సర్వే, మ్యుటేషన్, భూ పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
మంజూరైన ఇళ్లను త్వరగా గ్రౌడింగ్ చే యించాలని సూచన
పాడేరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ రీ సర్వే, మ్యుటేషన్, భూ పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం జిల్లాలోని రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ సర్వేకు సంబంధించి వీఆర్వోలు లేదా తహశీల్దార్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. ఆయా పెండింగ్ సమస్యలను సబ్‌కలెక్టర్లు తరచూ పర్యవేక్షించాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించి జీవో: 30, 23లలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వివిధ పథకాల్లో మంజూరైన ఇళ్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయించాలని ఆదేశించారు. కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించిన లబ్ధిదారులకు సైతం ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి తక్షణమే అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని, రేషన్ పంపిణీ తీరును పౌరసరఫరాల శాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు కార్డుల పంపిణీపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. అటవీ శాఖకు సంబంధించిన స్థలాలపై రీ సర్వే చేసి ఆయా సమస్యలను ఒక కమిటీ ద్వారా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరించుకోవాలన్నారు. రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన మ్యాప్‌లు, రిజిస్టర్లు, జియో మ్యాపింగ్, తదితరాలను సమన్వయం చేసుకొని పక్కాగా రికార్డులు రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభవ నొక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, జిల్లాలోని 22 మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.