ప్రాణాలు తీసిన అతివేగం
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:39 AM
‘‘అప్పటి వరకు రహదారిపై సాఫీగా వెళ్తున్న కారుకు ఎదురుగా మరో వాహనం అడ్డురావడంతో డ్రైవర్ ఒక్కసారిగా దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ గాలిలోకి ఎగురుతుంది. ఆ తర్వాత మళ్లీ నేలపై పల్టీలు కొట్టుకుంటూ ముందుకెళ్లి ఆగుతుంది’’ ఇది చాలా సినిమాల్లో కనిపించే దృశ్యం. ఇలాంటి ఘటనే కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో జరిగింది. కాకపోతే ఇక్కడ సినిమా స్టంట్లను తలపించేలా పల్టీలు కొట్టిన కారుకు ఏ వాహనం అడ్డురాలేదు. పరిమితికి మించిన వేగంతో కారును నడిపిన యువకుడు దానిని నియంత్రించుకోలేకపోయాడు. ఫలితంగా కారు కొట్టిన పల్టీలు నలుగురి ప్రాణాలను తీశాయి. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం నాలుగు కుటుంబాలను విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు, కంకిపాడు మండలం కుందేరుకు చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు.
గండిగుంట వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి
విజయవాడ- మచిలీపట్నం ఎన్‌హెచ్, సర్వీసు రోడ్డుకు మధ్య ఘటన
గుంతలో పడి 30 మీటర్లు పల్టీలు కొట్టిన కారు
ఒక పెద్ద బండరాయిని ఢీ కొట్టి గాల్లోకి లేచిన వాహనం
నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం
మృతులు విజయవాడ, కుందేరుకు చెందిన వారు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ఉయ్యూరు):
‘‘అప్పటి వరకు రహదారిపై సాఫీగా వెళ్తున్న కారుకు ఎదురుగా మరో వాహనం అడ్డురావడంతో డ్రైవర్ ఒక్కసారిగా దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ గాలిలోకి ఎగురుతుంది. ఆ తర్వాత మళ్లీ నేలపై పల్టీలు కొట్టుకుంటూ ముందుకెళ్లి ఆగుతుంది’’ ఇది చాలా సినిమాల్లో కనిపించే దృశ్యం. ఇలాంటి ఘటనే కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో జరిగింది. కాకపోతే ఇక్కడ సినిమా స్టంట్లను తలపించేలా పల్టీలు కొట్టిన కారుకు ఏ వాహనం అడ్డురాలేదు. పరిమితికి మించిన వేగంతో కారును నడిపిన యువకుడు దానిని నియంత్రించుకోలేకపోయాడు. ఫలితంగా కారు కొట్టిన పల్టీలు నలుగురి ప్రాణాలను తీశాయి. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం నాలుగు కుటుంబాలను విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు, కంకిపాడు మండలం కుందేరుకు చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు.
నైట్ రైడ్‌కు వెళ్లారా?
విజయవాడ మొగల్రాజపురానికి చెందిన చాట్రగడ్డ రాకేష్(24) పటమట సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తున్న తండ్రి చక్రపాణికి సహాయకుడిగా ఉంటున్నాడు. గిరిపురానికి చెందిన గొరిపర్తి పాపారావు(23), ఈటె ప్రిన్స్‌బాబు(22) స్నేహితులు. పాపారావు తండ్రి శివయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాపారావు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ప్రిన్స్‌బాబు విజయవాడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. రాకేష్, ప్రిన్స్ పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. రాకేష్, పాపారావు డిగ్రీ వరకు కలిసి చదువుకోవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. రాకేష్ తండ్రికి టాటా సఫారీ స్ర్టాం కారు ఉంది. ఈ ముగ్గురు యువకులు సోమవారం రాత్రి నగరంలో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాకేష్ ఇంట్లో చర్చికి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా కారును తీసుకొచ్చాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ముగ్గురు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పాపారావు కుటుంబం ఇంతకుముందు కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో ఉండేది. తర్వాత ఉపాధి నిమిత్తం ఆ కుటుంబం విజయవాడలో గిరిపురానికి మారింది. రాత్రంతా కారులో తిరగాలని భావించిన ఈ ముగ్గురు యువకులు మచిలీపట్నం జాతీయ రహదారిని ఎంచుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా కుందేరుకు వెళ్లి అక్కడ పాపారావు బంధువు కొణతం చింతయ్య(19)ను ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి ఉయ్యూరు వైపునకు బయలుదేరారు. చింతయ్య గ్రామంలో పాడిరైతుగా ఉన్నాడు.
అతివేగం.. అదుపు తప్పి
నైట్‌రైడ్‌కు బయలుదేరిన ఈ యువకులు మితిమీరిన వేగంతో ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. కారును రాకేష్ నడుపుతున్నాడు. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారికి, సర్వీసు రోడ్డుకు మధ్యన గండిగుంట వద్ద కొంతదూరం మైనర్ డ్రెయిన్ వంటి బోది ఉంది. రహదారి మొత్తం విశాలంగా ఉండడంతో రాకేష్ పరిమితికి మించిన వేగంతో కారును నడిపాడు. వేగం ఎక్కడా తగ్గించకపోవడంతో అదుపు తప్పింది. దీంతో కారు బోదిలోకి దూసుకుపోయింది. 30 మీటర్ల దూరం పల్టీలు కొట్టింది. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉండడంతో దాన్ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరింది. గాల్లోను కొద్దిసేపు పల్టీలు కొట్టిన తర్వాత సర్వీసు రోడ్డుపై పడింది. అక్కడి నుంచి మరో 70 మీటర్లు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో రాకేష్, ప్రిన్స్‌బాబు, చింతయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాపారావు మాత్రం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
కారు ఇంట్లోనే ఉందనుకున్న తండ్రి..
అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఉయ్యూరు పోలీసులు రాకేష్ తండ్రి చక్రపాణికి ఫోన్ చేసి మాట్లాడే వరకు తన కారు ఎక్కడ ఉందో ఆయనకు తెలియలేదు. పోలీసులు చక్రపాణికి ఫోన్‌చేసి టాటా సఫారీ స్ర్టాం కారు మీదేనా అని అడిగారు. అప్పటికి ఆయనకు ఏం జరిగిందో తెలియలేదు. పోలీసులు రెండు మూడు సార్లు అడిగేసరికి కారు తన వద్దే ఉందని చెప్పారు. ఈ కారుకు ప్రమాదం జరిగిందని పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి చూసుకున్నారు. అక్కడ కారు కనిపించకపోవడంతో షాకయ్యారు. చర్చికి వెళ్తున్నానని చెప్పిన కుమారుడు రాకేష్ కారు తీసుకెళ్తున్నానన్న సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయలేదు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న తర్వాత ఆయన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. జరిగిన ప్రమాదాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రాకేష్ నడిపిన వేగానికి టాటా సఫారీ కారు కాబట్టి ఆనవాళ్లు మిగిలాయని, అదే మరో కారు అయితే నామరూపాలు ఉండేవి కావని స్థానికులు చెబుతున్నారు.