Share News

CM Chandrababu: స్క్రబ్‌ టైఫ్‌సపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:26 AM

స్క్రబ్‌ టైఫ్‌సపై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని...

CM Chandrababu: స్క్రబ్‌ టైఫ్‌సపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటుకు నిర్ణయం

  • వ్యాధిని పూర్తిగా నివారించేందుకు తక్షణ చర్యలు

  • సీజనల్‌ వ్యాధుల నివారణకు కలిసి పనిచేయాలి

  • అత్యవసర సమావేశంలో సీఎం ఆదేశాలు

అమరావతి, ఆకివీడు రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్క్రబ్‌ టైఫ్‌సపై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ తీవ్రత, బాధితులకు అందుతున్న వైద్యసాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... స్క్రబ్‌ టైఫస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటు చేసే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చే నివేదికను అమలు చేయడంతో పాటు వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్‌ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని, దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని అన్నారు. మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా.. రాష్ట్రంలో ఈ ఏడాది 1,592 మంది స్క్రబ్‌ టైఫస్‌ బారినపడ్డారని, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 మంది మృతికి కారణం ఏమిటో పరిశీలిన చేస్తున్నామన్నారు.


ఇతర ఆరోగ్య సమస్యలు, వివిధ అవయవాల వైఫల్యం కారణంగా ఆ తొమ్మిది మంది మరణించినట్లు వివరించారు. మరోవైపు స్క్రబ్‌ టైఫస్‌ బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని, వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్‌ టైఫస్‌ ప్రభావం ఉందని, ఈ కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిసాల్లో 7 వేల చొప్పున కేసులున్నాయని వివరించారు. రాష్ట్రంలో గతేడాది తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సీజనల్‌ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గతేడాది రాష్ట్రంలో 5,555 డెంగీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,452 కేసులే నమోదయ్యాయని చెప్పారు. సమీక్షలో ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌, కమిషనర్‌ వీరపాండియన్‌, ట్రస్ట్‌ సీఈవో దినేష్ కుమార్‌, ఎండీ గిరీశా ఇతర అధికారులు పాల్గొన్నారు.


పశ్చిమలో యువకుడికి స్క్రబ్‌ టైఫస్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ఓ యువకుడికి స్క్రబ్‌టైఫస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల కాలికి మచ్చలు రావడంతో ఆ యువకుడు వైద్యులను సంప్రదించాడు. ఐదు రోజుల క్రితం ఆయనకు ఎలీజా పరీక్ష నిర్వహించగా స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఆ యువకుడిలో వ్యాధి లక్షణాలు లేవు. జిల్లా వైద్యాధికారి గీతాబాయి శనివారం యువకుడి పూర్తి వివరాలు సేకరించి.. అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 04:29 AM