Sanskrit Academy Chairman: తిరుపతిలో ప్రత్యేక సంస్కృత అకాడమీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:03 AM
తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ (శరత్‌చంద్ర) తెలిపారు.
తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ (శరత్‌చంద్ర) తెలిపారు. తిరుపతిలోని తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి, విజయవాడలో తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయాలు కొనసాగుతాయని, వాటిని తరలిస్తున్నారనే ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు. గతంలో నిలిచిపోయిన తెలుగు అకాడమీ జర్నల్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను తీసుకొస్తామని, 1 నుంచి 10వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాల ప్రచురణ బాధ్యతను అకాడమీ చేపట్టే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని వివరించారు. పాఠ్య పుస్తకాలను సొంతంగా ప్రచురించి, వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలుగులో చదవడం, మాట్లాడటం, రాయడం వంటి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించాలని భావిస్తున్నట్టు విల్సన్ ఈసందర్భంగా తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ పరిధిలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారికి టైంస్కేల్ వర్తింపజేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అకాడమీ అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, అప్పట్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపడతామని వెల్లడించారు.