Minister Anagani Satya Prasad: విశాఖ భూకబ్జాలపై ప్రత్యేక నివేదిక
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:27 AM
విశాఖపట్నంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు వైసీపీ నేతలే విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
వైసీపీ నేతలే కబ్జాలకు పాల్పడ్డారు: అనగాని
విశాఖపట్నం, జూలై 28(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు వైసీపీ నేతలే విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నేత సతీమణి తన భూమి బలవంతంగా రాయించుకున్నారని ఒకరు ఫిర్యాదు చేశారని తెలిపారు. అలాగే ఎంపీగా పనిచేసిన వ్యక్తి నిర్మించిన భవనంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఫిర్యాదు చెప్పారు. విశాఖలో భూకబ్జాలపై రెవెన్యూ యంత్రాంగం నివేదిక తయారు చేస్తోందని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానం తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. 22-ఎ నుంచి తమ భూములను తప్పించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని తెలిపారు. పంచ గ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. భూకబ్జాల్లో కూటమి పార్టీ నేతలు ఉన్నా వదిలేది లేదని, చట్టం ముందు అందరూ ఒకటేనని స్పష్టం చేశారు.