మల్లన్నకు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:59 PM
శ్రీశైలక్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువై ఉన్న పురాతన శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
- వెండి రథంపై ఆది దంపతులు
శ్రీశైలం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలక్షేత్రంలో ప్రధాన దేవాలయానికి ఉపాలయాలుగా ఉండే ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధార పంచమఠాలలో కొలువై ఉన్న పురాతన శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయానికి కుడి వైపు ఉన్న పురాతన రాతిమండపంలో స్వామి, అమ్మవార్లను ఊయలతో ఆశీనులచేసి షోడశోపచార పూజలు నిర్వహించారు. అర్చక వేదపండితులు సహస్ర దీపాలను వెలిగించారు. అనంతరం వెండి రథంలో ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు పుష్పార్చనలు చేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు. భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.
మహానందీశ్వరుడికి పల్లకీ సేవ
మహానంది: మహానంది క్షేత్రంలో పరమశివుడికి ప్రీతివంతమైన సోమవారం రాత్రి పల్లకీ సేవ భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో మహానందీశ్వర స్వామి,కామేశ్వరీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆశీనులు గావించారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల శివనామస్మరణతో పాటు మేళతాళాలతో పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.