AP Govt: తుఫాన్ జిల్లాలకు ప్రత్యేక అధికారులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:58 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. తుఫాన్ ప్రభావం ఉందన్న అంచనా మేరకు...
సహాయ చర్యల పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లు
అజయ్‌జైన్, సిసోడియాకు జోనల్ బాధ్యతలు
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో సహాయ చర్యల పర్యవేక్షణ కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. తుఫాన్ ప్రభావం ఉందన్న అంచనా మేరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని 19 జిల్లాలకు 18 మంది ఐఏఎస్‌లను ఇన్‌చార్జి అధికారులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లాల వరకు సీనియర్ ఐఏఎస్ అజయ్‌జైన్, పశ్చిమ గోదావరి నుంచి చిత్తూరు జిల్లా వరకు సీనియర్ ఐఏఎస్ ఆర్పీ సిసోడియాకు జోన్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. అ ల్లూరి, అనకాపల్లి జిల్లాలకు వాడరేవు వినయ్‌చంద్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. ప్రత్యేక అధికారులు తక్షణమే కేటాయించిన జిల్లాలకు వెళ్లి, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని తుఫాన్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నష్టాలను లెక్కించి, బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే వరకు, ప్రత్యేక అధికారులు తుఫాన్ సహాయ అధికారులుగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.