CM Chandrababu: లక్ష్మయ్య నాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:06 AM
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: సీఎం చంద్రబాబు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించనని స్పష్టీకరణ
మృతుడి భార్య, పిల్లలకు భూమి,ఆర్థిక సాయం ప్రకటన
గాయపడ్డ నవీన్, భార్గవ్‌కు సాయంతో పాటు వైద్య ఖర్చులు
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇటీవల హత్యకు గురైన లక్ష్మయ్యనాయుడు కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ట్రైబ్యునల్ ద్వారా వేగంగా విచారణ పూర్తి చేసి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్య తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. హోంమంత్రి అనిత, మున్సిపల్ మంత్రి నారాయణ, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో మంగళవారం ఆయన సమీక్షించారు. రూ.2.30 లక్షల అప్పు అడిగినందుకు లక్ష్మయ్య నాయుడును హత్య చేయడం తీవ్ర అమానుష, అమానవీయ ఘటనగా చంద్రబాబు అభివర్ణించారు. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. లక్ష్మయ్య నాయుడి భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. వారి ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పవన్‌కు నాలుగు ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు... మరో బాధితుడు భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.