TDP leader BTech Ravi: జైల్లో ఆ రోజు ఏం జరిగింది?
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:06 AM
వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైల్లో బెదిరించిన వ్యవహారంపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ బుధవారం ఆయనతోపాటు....
దస్తగిరికి బెదిరింపుల ఘటనపై.. బీటెక్ రవిని ఆరాతీసిన విచారణ కమిటీ
దస్తగిరి, ఆయన భార్య నుంచీ వివరాల సేకరణ
కడప క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైల్లో బెదిరించిన వ్యవహారంపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ బుధవారం ఆయనతోపాటు ఆయన భార్యను విచారించింది. అలాగే పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పిలిచి ఆ ఘటనపై ఆరా తీసింది. దస్తగిరి మరోకేసులో కడప సెంట్రల్ జైల్లో 2023లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో మెడికల్ క్యాంపు పేరుతో ఈ కేసులో ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలులోకి వచ్చి తనను బెదిరించారని, రూ.20 కోట్లు డబ్బులు ఆఫర్ చేశారని అప్పట్లో దస్తగిరి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై మరోసారి దస్తగిరి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిగ్గు తేల్చడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, కడప జిల్లా డీఎంహెచ్‌వో నాగరాజు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, జైలు అధికారి ఇర్ఫాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ జైలు అధికారులతో పాటు అప్పుడు పనిచేసిన డాక్టర్లను విచారించింది. ఈ నేపథ్యంలో బుధవారం కమిటీ బృందం టీడీపీ నేత బీటెక్ రవితోపాటు దస్తగిరిని, ఆయన భార్య షబానాను సెంట్రల్‌జైలులోని తన క్యాంపునకు పిలిపించి విచారించింది. బీటెక్ రవిని 40 నిమిషాల పాటు విచారించి ఆయన స్టేట్‌మెంటును రికార్డు చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో వైసీపీ ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కేసులో అరెస్టు అయి తాను కడప సెంట్రల్ జైలులో ఉన్నానని ఆయన తెలిపారు. దస్తగిరిని ఉంచిన బ్యారక్‌కు డాక్టర్ చైతన్యరెడ్డి వెళ్లడం తాను కళ్లారా చూశానని పేర్కొన్నారు. అనంతరం ఆయన జైలు వెలుపల ఆ ఘటనపై మరింత వివరంగా మీడియాతో మాట్లాడారు. ‘‘2023 నవంబరు 14 నుంచి 29 వరకు నేను జ్యుడిషియల్ రిమాండులో ఉన్నాను. ఆ నెల 28వ తేదీన వివేకా హత్యకేసులో నిందితుడైన శంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో అప్పటి జైలు వైద్యురాలు పుష్పలత, చైతన్యరెడ్డి, జైలు సిబ్బంది దస్తగిరి బ్యారక్ వెళ్లడం గమనించాను. చైతన్యరెడ్డి తెలుసు కాబట్టి బ్యారక్ వైపు వెళుతున్న ఆయనను గుర్తించాను’’ అని బీటెక్ రవి తెలిపారు. కాగా.. విచారణకు హాజరైన దస్తగిరి, అతడి భార్య మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.