AP Cabinet Sub Committee: పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:11 AM
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది.
కొత్త జిల్లా ఏర్పాటుతో అనేక సమస్యలు
పైగా చిన్న జిల్లా అవుతుందని రెవెన్యూ అధికారుల మనోగతం
స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుచేసి పూర్తి అధికారాలివ్వడానికి మంత్రులు ఓకే
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. బుధవారం సచివాలయంలో జరిగిన భేటీలో దీనిపై చర్చించారు. ముంపు మండలాలతో కలిపి పోలవరం పేరిట కొత్త జిల్లా ఏర్పాటు వల్ల అనేక సమస్యలుంటాయని రెవెన్యూ శాఖ చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మునిగిపోగా మిగిలే ప్రాంతాలతో జిల్లా ఏర్పాటు చేస్తే.. అది చాలా చిన్నదిగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపఽథ్యంలో పుదుచ్చేరి పరిధిలోని యానాం తరహాలోనే.. పోలవరం ప్రాజెక్టు పరిధిలో మునిగిపోకుండా ఉండే మండలాలు, వాటి భౌగోళిక ప్రాంతాలతో ప్రత్యేక స్పెసిఫైడ్ అథారిటీ లాంటిదాన్ని ఏర్పాటు చేసి, పూర్తి అధికారాలిస్తే సరిపోతుందని మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిపై వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.