రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి: అయ్యన్న
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:54 AM
నేడు రాజకీయాలు భ్రష్ట్టు పట్టిపోయాయి. యువత రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత తీసుకునే నిర్ణయాల్లో వేగం ఉంటుంది.
కానూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘నేడు రాజకీయాలు భ్రష్ట్టు పట్టిపోయాయి. యువత రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత తీసుకునే నిర్ణయాల్లో వేగం ఉంటుంది. వారి అవసరం రాజకీయాలకు ఎంతో ఉంది’ అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం కేవీ రావు సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ రాఘురామ కృష్ణరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ వర్సిటీ వైస్‌చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అయ్యన్న ప్రసంగించారు. ‘సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ కాలంలో సైబర్ భద్రతపై నైపుణ్యంగల యువత అవసరం. పోలీసులకు కూడా సైబర్ సెక్యూరిటీపై శిక్షణ అవసరం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రం ఏర్పాటు కావడం ఇదే ప్రథమం’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఈ కేంద్రానికి తన పేరు పెట్టడంపై కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కేవీ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుకు కేవీ రావు రూ.1.36 కోట్లు అందజేశారు.