Speaker Ayyanna Patrudu: ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ముఖ్యం
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:18 AM
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు యూకే పార్లమెంట్‌కు చెందిన హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉప సభాపతులతో చట్టసభల పనితీరుకు...
రాజ్యాంగాన్ని విస్మరిస్తే ప్రజలు సహించారు
యూకే ఎగువ, దిగువ సభల డిప్యూటీ స్పీకర్లతో సమావేశమైన స్పీకర్ అయ్యన్న
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు యూకే పార్లమెంట్‌కు చెందిన హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉప సభాపతులతో చట్టసభల పనితీరుకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్(యూకే పార్లమెంట్ హౌస్)లో పర్యటించారు. బార్బడోస్‌లో 68వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ సదస్సు ముగిసిన తర్వాత లండన్ అధ్యయన పర్యటనలో స్పీకర్ పాల్గొన్నారు. యూకే పార్లమెంటు ఎగువ సభ సీనియర్ డిప్యూటీ స్పీకర్ లార్డ్ గార్డినర్ ఆఫ్ కింబల్‌తో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా యూకే పార్లమెంటులో కమిటీ వ్యవస్థ పనితీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. చట్టసభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ జవాబుదారీతనం, అదేవిధంగా ఎన్నుకున్న ప్రజల పట్ల ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా లార్డ్ గార్డినర్ ఆఫ్ కింబల్ మాట్లాడుతూ... భారత ప్రజాస్వామ్య గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక బ్రిటీష్ సంస్థ కూడా పాలుపంచుకుంటుందని అయ్యన్న పాత్రుడు చెప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అయ్యన్న హౌస్ ఆఫ్ కామన్స్(యూకే పార్లమెంట్ దిగువ సభ) ప్రిన్సిపల్ డిప్యూటీ స్పీకర్ నుస్రత్ ఘనీతో సమావేశమయ్యారు. శాసనపరమైన విధానాలు, ప్రజలకు సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించడంలో చట్ట సభసభ్యుల పాత్రకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, తదితరులు పాల్గొన్నారు.